22 August, 2026 | 5:41 PM

పాలిటెక్నిక్ విద్యను యధావిధిగా కొనసాగించాలి

22-08-2026 04:02 PM

గంభీరావుపేట, ఆగస్టు 22(విజయక్రాంతి): తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను లేబర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని ‘శక్తి’ స్కీమ్‌లో విలీనం చేస్తూ తీసుకువచ్చిన జి.ఓ. నెం.97ను రద్దు చేయాలని బిఆర్ఎస్‎వి యువజన విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నాయకులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యను ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లతో కలపడం వల్ల డిప్లొమా కోర్సుల ప్రాముఖ్యత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులపై ఫీజుల భారం పెరిగి, స్కాలర్‌షిప్ సమస్యలు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యకు అవకాశాలు తగ్గి, సర్టిఫికెట్లు కేవలం స్కిల్స్ ఆధారితంగా మారిపోతాయని తెలిపారు. కాబట్టి పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, భిక్షపతి,  సందీప్, ప్రశాంత్, అర్జున్, శ్యామ్, కళ్యాణ్, శంకర్, అజమాత్, రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.