ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తాం
- త్వరలోనే గుర్తింపు సంఘాలకు ఎన్నికలు
- 11 శాతం పీఆర్సీతో జూలై నెల జీతాలు చెల్లిస్తాం
- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): భవిష్యత్తలో సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుర్తింపు సంఘం కార్మిక నేతలను కమిటీలో చేర్చి విలీనానికి విధివిధానాలను రూపొందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని, గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొ న్నారు. అలాగే 11 శాతం పీఆర్సీతో జూలై నెల జీతాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సంఘాల మొదటి డిమాండ్ గుర్తింపు సంఘాల ఎన్నికలని, ఇప్పుడు మాటమార్చి కార్మికులను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ మేరకు శనివారం మంత్రి పొన్నం.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి విధివిధానాలు రూపొందించే అధి కారుల కమిటీలో కార్మిక ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని గతంలో మంత్రులు, అధికారులు, కార్మిక సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో కార్మికులు ఏకగ్రీవంగా నిర్ణయించారని పేర్కొన్నారు.
అయితే ఆ కమిటీలో ఉండే కార్మిక నాయకులు గుర్తింపు పొందిన సంఘం నుంచి ఉండాలంటే ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం అందరి సమక్షంలో తీసుకున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని, లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను ఎన్నికల నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, త్వరలోనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించే దిశగా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతీ హామీనీ అమలు చేస్తోందన్నారు. కొంత మంది కార్మిక సంఘాల నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులను ప్రజలను తప్పుదోవ పట్టించడం బాధాకరమన్నారు. ఏపీ తరహాలో విలీనం తర్వాత ఇబ్బందులు కలగొద్దనే విధివిధానాలు రూపొందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.






