టీబీ నిర్మూలన లక్ష్య సాధనకు సమన్వయంతో పనిచేయాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, జూలై 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో క్షయ(టిబి) వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో టిబి వ్యాధి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అన్నారు, అధిక ప్రమాదంలో ఉన్న వర్గాలకు కఫం పరీక్షలు, ఎక్స్రే తదితర నిర్ధారణ సేవలను విస్తృతంగా అందించాలని సూచించారు.
టిబి రోగులతో సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు, ఇతర పరిచయ వ్యక్తులకు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించి, అవసరమైన వారికి టిబి నివారణ చికిత్స అందించాలని తెలిపారు.హెచ్‌ఐవి, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిలో తప్పనిసరిగా టిబి స్క్రీనింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు, చికిత్స ప్రారంభించిన ప్రతి రోగి పూర్తిస్థాయిలో మందులు వాడేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా చూడడం ద్వారా రోగులు పూర్తిగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పౌష్టికాహార సహాయం కోసం ప్రభుత్వం అందించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నిధులు అర్హులైన రోగుల బ్యాంకు ఖాతాల్లో సకాలంలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టిబి నిర్మూలనలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్యుల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్న కలెక్టర్, ప్రతి టిబి కేసును తప్పనిసరిగా నమోదు చేసి, సమగ్ర వైద్య సేవలు అందించేందుకు అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. టిబి రహిత కామారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి శాఖ, ప్రతి వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వైద్యులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు.






