బుట్టదాఖలైన ‘భృతి’
నిరుద్యోగులకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మొండిచేయి
హామీ మ్యానిఫెస్టోలో భద్రం!
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలు వస్తే యువకుల్లో రెండు అంశాలు తప్పనిసరిగా చర్చకు వస్తుంటాయి. ఒకటి ఉద్యోగాలు, రెండోది నిరుద్యోగ భృతి. లక్షలాది మంది యువ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు భారీ హామీలు ఇస్తుంటాయి. ‘ఉద్యోగం వచ్చే వరకు భృతి ఇస్తాం’, ‘నిరుద్యోగ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాం’, ‘యువతకు అండగా నిలుస్తాం’ అంటూ ప్రతి ఎన్నికల్లో ఊదరగొడుతుంటాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ హామీలు గాల్లో కలుస్తుంటాయి. ప్రభుత్వాలు, పార్టీల మ్యానిఫెస్టోలు మారినా.. ప్రభుత్వాలు మారినా నిరుద్యోగ భృతి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది.
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి) : తెలంగాణ ఏర్పడిన తర్వాత యువతలో ప్రభుత్వ ఉద్యోగాలపై భారీ ఆశలు పెరిగాయి. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని, నియామకాలు వేగవంతమవుతాయని, నిరుద్యోగ సమ స్య తగ్గుతుందని భావించారు. కానీ పడెండేళ్ల తర్వాత కూడా నిరుద్యోగ సమస్య రాజకీయ చర్చలకే పరిమితం కావడం యువతలో తీవ్ర అసంతృప్తిని పెంచుతోంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరుద్యోగ యువత అంచనాలకు అనుగుణంగా నియామకాలు జరగడం లేదనేది వాస్తవం.
ఇటీవలికాలంలో నిరుద్యోగులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడమే దీనికి నిదర్శనం. ఒకవైపు ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, మరోవైపు నియామక ప్రక్రియలు కోర్టు కేసులు, పరిపాలనా జాప్యాలు, పరీక్షల షెడ్యూళ్ల మార్పులు, ఫలితాల ఆలస్యం వంటి కారణాలతో ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి.
నోటిఫికేషన్ విడుదల నుంచి తుది నియామకం వరకు నెల లు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సుదీర్ఘ నిరీక్షణలో యువతపై ఆర్థిక, మానసిక ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఉద్యోగం రాకపోవడంతో కుటుం బాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో నిరుద్యో గ భృతి ఉంటే కనీస ఆర్థిక భరోసా లభిస్తుందనే ఆశతో యువత ఎదురుచూ స్తోంది. కానీ ఎన్నిక ల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ కూడా అమలు కావడం లేదు.
దీంతో ‘ఉద్యోగాలు లేవు.. భృతి రాదు’ అనే ఆవేదన నిరుద్యోగుల్లో పెరుగుతోంది. ఎన్నికల సమయంలో నిరు ద్యోగ యువతే ప్రతి రాజకీయ పార్టీకి అత్యంత కీలకమైన ఓటు బ్యాంక్‌గా మారుతున్నది. అందుకే ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, పరీక్షల నిర్వహణ, ఖాళీల భర్తీ వంటి అంశాలు మేనిఫెస్టోల్లో ప్రధానంగా కనిపిస్తాయి. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు అండగా ఉంటామని, ఉద్యోగం వచ్చే వరకు ఆర్థిక భరోసా కల్పిస్తామని పార్టీలు హామీలు ఇస్తాయి.
అయితే ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే హామీల అమలుపై స్పష్టత లేకపోవడం, నిర్ణయాలు వాయిదా పడటం, ఆర్థిక పరిస్థితులను కారణంగా చూపించడం తరచూ కనిపించే పరిణామంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలు కేవలం ఓట్లు సాధించే రాజకీయ సాధనంగా మాత్రమే మిగిలిపోతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని నిరుద్యోగ భృతి విషయంలో తీవ్రంగా విమర్శించిన పార్టీలు సైతం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హామీ అమలులో జాప్యం చేయడం యువతలో అసంతృప్తిని పెంచుతోంది. నిరుద్యోగ భృతిని చాలామంది నెలకు ఇచ్చే నగదు సాయంగా మాత్రమే చూస్తారు. కానీ ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా సిద్ధమవుతున్న లక్షలాది మంది యువతకు అది కేవలం డబ్బు కాదు.. ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టే ఆర్థిక భరోసా.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కోచింగ్ ఫీజులు, పుస్తకాల కొనుగోలు, ఆన్‌లైన్ కోర్సులు, పరీక్షల దరఖాస్తు ఫీజులు, ప్రయాణ ఖర్చులు, హాస్టల్ లేదా గది అద్దెలు వంటి అనేక వ్యయాలను భరించాల్సి వస్తోంది. ఈ క్రమంలో నిరుద్యోగ భృతి వారికి కొంత ఊరట కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన యువతకు ఈ భృతి మరింత కీలకం.
ఉద్యోగం వచ్చే వరకు కనీస అవసరాలు తీర్చుకునేందుకు, పోటీ పరీక్షలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు ఇది తోడ్పడుతుంది.కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో చాలామంది యువత మధ్యలోనే పరీక్షల సన్నాహాలను విరమించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. అలాంటి వారికి నిరుద్యోగ భృతి ఒక సామాజిక భద్రతా వ్యవస్థలా ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నియామక ప్రక్రియలు సంవత్సరాల పాటు సాగుతున్న పరిస్థితుల్లో, యువత ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని కొంతైనా తగ్గించే సాధనంగా భృతిని చూస్తున్నారు. అందుకే నిరుద్యోగ భృతి అమలు కావడం అనేది డబ్బు పంపిణీ కంటే ఎక్కువగా, ప్రభుత్వం తన ఎన్నికల హామీలకు కట్టుబడి ఉందని నిరూపించే అంశంగా కూడా మారింది.
అప్పుడు బీఆర్‌ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్..
గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ. 3,016ల భృతి అందిస్తామని ప్రకటించింది. కానీ ఆ హామీ పూర్తిస్థాయిలో అమలుకాలేదని అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించిన కాంగ్రెస్, 2023 ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ భృతిని మరోసారి కీలక హామీగా ప్రకటించింది. ఉద్యోగాలు కల్పించేవరకు రూ. 4 వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చింది.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ల కావస్తున్నా నిరుద్యోగ భృతి అమలుపై ఇప్పటికీ స్పష్టత కరువైంది. దీంతో నిరుద్యోగ యువతలో ఇంకా ఎదురుచూపులే కనిపిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల నిరుద్యోగులున్నారని తెలుస్తోంది. అయితే అనధికారికంగా ఈ సంఖ్య 20 లక్షలకు పైనే ఉంటుందనే రాజకీయ విమర్శ కూడా ఉంది.
ఇంత భారీస్థాయిలో యువతను ఆకట్టుకోవడానికి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో హామీలు గుప్తిస్తున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని చట్టపరంగా తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధన ప్రస్తుతం లేదు.
అందువల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు, పరిపాలనా అవసరాలు లేదా ఇతర కారణాలను చూపుతూ ప్రభుత్వాలు కొన్ని హామీల అమలును వాయిదా వేయడం లేదా అమలు చేయకపోవడం తరచూ కనిపిస్తోంది. మేనిఫెస్టోపై ఆయా పార్టీలు, ప్రభుత్వాలు జవాబుదారితనంతో వ్యవహరించకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రశ్నించే దిశగా యువత..
ఒకప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్నికలు పూర్తయ్యాక క్రమంగా మరుగునపడేవి. కానీ డిజిటల్ యుగంలో పరిస్థితి పూర్తిగా మారింది. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు, ఎన్నికల ప్రసంగాలు, హామీలు శాశ్వతంగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని యువత తిరిగి గుర్తు చేస్తూ ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది. గతంలో రాజకీయ చర్చలు సభలు, సమావేశాలకే పరిమితమైతే, ఇప్పుడు సోషల్ మీడియా ప్రజా వేదికగా మారింది.
ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం, పరీక్షల నిర్వహణ, ఫలితాల ఆలస్యం, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై వేలాది మంది యువత ఒకే వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ ప్రచారాలు, ఆన్‌లైన్ క్యాంపెయిన్లు, డిజిటల్ నిరసనల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రకంగానే ఇటీవల ఢిల్లీ వేదికగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ ఉద్యమం విజయం సాధించింది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో యువత గొంతెత్తడం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ప్రభుత్వాలను ప్రశ్నించడం తప్ప మరో మార్గం లేదనే భావన నిరుద్యోగ యువతలో బలపడుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు అని యువత అభిప్రాయపడుతోంది.
ప్రభుత్వాలు మారినా నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలు నెరవేరకపోవడంతో, ఇకపై కేవలం హామీలను నమ్మే పరిస్థితి లేదని పలువురు నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా, నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాల వేదికల ద్వారా తమ సమస్యలను మరింత బలంగా వినిపించాలని యువత భావిస్తోంది. ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనలను గుర్తు చేస్తూ, హామీల అమలుపై ప్రభుత్వాలను నిలదీయడం, పురోగతిపై స్పష్టత కోరడం, జవాబుదారీతనం డిమాండ్ చేయడం వంటి ధోరణి పెరుగుతోంది.






