28 July, 2026 | 2:50 AM

క్షేత్ర స్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలి

28-07-2026 01:48 AM

ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు

ఉట్నూర్, జూలై 27: ప్రజావాణికి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ కి చెందిన మెస్రం చిత్రు తనకు పట్టా ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం మాణిక్ గూడకి చెందిన భీము తనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను సమర్పించారు. ప్రజావాణిలో పీఓతోపాటు ఏపీఓ (జనరల్) వసంతరావు జాదవ్, ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.