28 July, 2026 | 2:02 AM

మత్స్యశాఖ నిర్లక్ష్యం!

28-07-2026 01:05 AM
  1. ఉచిత చేపపిల్లల పంపిణీపై అలసత్వం
  2. జూలై ముగుస్తున్నా టెండర్లలో కదలిక ఏదీ?
  3. ప్రతి ఏటా ఇదే విధానం అమలు 
  4. గతేడాది 80 కోట్లకు.. 30 కోట్ల చేపపిల్లలే పంపిణీ  
  5. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే?: మత్స్యకార సంఘాలు 
  6.    4.55 లక్షల మంది మత్స్యకారుల ఉపాధికి దెబ్బ

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): రాష్ట్రం లో మత్స్యశాఖ దూరదృష్టికి బదులు దురదృష్టితో వ్యవహరిస్తోంది. జూలై ముగుస్తున్నా.. ఇంకా నిద్రావస్థ నుంచి మేలుకోవడం లేదు. ఉచిత చేప పిల్లల పింపిణీపై నిర్లక్ష్యంతో, తీవ్ర అలసత్వంతో వ్యవహారిస్తోంది. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనేది ఇంకా స్పష్టత లేకుండా పోయింది. చెరువులు అలుగు పారిన తర్వాత టెండర్లు పూర్తి చేస్తారా..? అని మత్స్యకారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఏటా ఇదే కథ పునరావృతమవు తుందని విమర్శిస్తున్నారు. గతేడాది 80 కోట్లకు బదులు 30 కోట్ల చేప పిల్లలే పంపిణీ చేశారని మండిపడుతున్నారు. కాంట్రాక్టర జేబులు నింపడానికే మత్స్యశాఖ తాత్సారం చేస్తోందని మత్స్యకార సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో సుమారు 4.55 లక్షల మంది మత్స్యకారుల ఉపాధికి దెబ్బ పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో 6 వేలకు పైగా మత్స్యకార సంఘాలు ఉండగా, దాదాపు 4.55 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు.

పరోక్షంగా మరో 5లక్షలకుపైగా ఉపాధి పొందుతున్నారు. వీరు చెరువులు, రిజర్వాయర్లు, జలాశయాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారి జీవనోపాధిని మెరుగుపర్చ డం, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రతిఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుంది.

అయితే, అధికారుల నిర్లక్ష్యం వారికి శాపమవుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమయానికి చేప పిల్లలను వేస్తేనే అవి పెరిగి, శీతాకాలం నాటికి వేటకు అనుకూలంగా మారతా యి. టెండర్లు ఆలస్యమై, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో చేప పిల్లలను వేస్తే అవి పెరగక మత్స్యకారు ల ఉపాధి దెబ్బతింటుంది. అంతే కాకుండా సొసైటీలు కూడా తీవ్ర నష్టాల్లో  కూరుకుపోతున్నాయి. 

నిర్ణయం తీసుకోకపోతే ఆలస్యమయ్యే ప్రమాదం..

వర్షాకాలం ఇప్పటికే ప్రారంభమైంది. కానీ ఎల్‌నినో ప్రభావంతో కొంత ఆలస్యమైనా.. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఏదో ఒక రోజు వరుణుడు కరిణిస్తే భారీ వర్షాలు కురిసి.. చెరువులు, కుంటులు, జలాశాయాలు నిండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోతే మొత్తం పంపిణీ కా ర్యక్రమం ఆలస్యమయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వ శాఖలకు వర్షాకాలం ఎప్పుడు ప్రారంభమవుతుం దో, చేప పిల్లల పంపిణీకి ఏ సమయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయో తెలుసు.

అయినప్పటికీ ప్రతి ఏడాది చివరి నిమిషంలో టెండర్ల ప్ర క్రియ చేపట్టడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్నలు ఉత్పతన్నమవుతున్నాయి. టెండర్ల నో టిఫికేషన్ విడుదల, సాంకేతిక పరిశీలన, ఆర్థిక బిడ్ల పరిశీల న, కాంట్రాక్టర్ల ఎంపిక, ఒప్పందాల ఖరారు వంటి ప్రక్రియలకు నెల సమయం అయినా పడుతుంది. విషయం తెలిసినా అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే ప్రశ్నలను మత్స్యకారులే సంధిస్తున్నారు. ప్రైవేట్ హేచరీలతో లోపాయికారీ ఒప్పందాలు, సాంకేతిక సాకులు చెబుతూ అధికారులు టెండర్లను కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ పథకం ప్రారంభమైన 2016 నుంచి నేటి వరకు ‘ఆలస్యం’ అనేది ఓ ఆనవాయితీగా మారింది. సీజన్ అయిపోతున్న సమయంలో ఆదరబాదరగా టెండర్లు ఖరారు చేయడం, చెరువుల్లో నీటి మట్టం పెరిగిపోయాక, చేప పిల్లలను వేసే పరిస్థితులు లేకపోయి నా కాంట్రాక్టర్ల నుంచి రికార్డుల్లో లెక్కలు చూపించడం, చిన్న చేప పిల్లలను (సైజు తక్కువ ఉన్నవి) వేసి మమ అని పించడం జరుగుతుంది. ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నా శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నది.

అదును దాటాక అరకొరగా పంపిణీ

చేప పిల్లల పంపిణీ ప్రక్రియ విజయవంతం కావాలంటే అధికారులు ముందస్తు ప్రణాళికలతో ముందుసాగాలి. సాధారణంగా వేసవి ముగిసే సమయా నికే నాణ్యమైన చేప పిల్లల సేకరణకు సంబంధించి ముందస్తు అంచనాలు రూపొందించాలి. జూలై తొలి వారంలోనే టెండర్లు ఖరారు చేసి, నీటి లభ్యతను బట్టి చెరువుల్లో వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. జూలై నెల చివరి వారం వచ్చినా పూర్తికా వాల్సిన టెండర్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాక పోవడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఏటా సమయా నికి టెండర్లు పిలవకపోవడం, అధిక వర్షాలు కురుస్తున్న సమయంలో అప్పటికప్పుడు హడావిడి చేస్తూ చేప పిల్లలను వదలడం పరిపాటిగా మారింది. సమయం దాటాక అరకొరగా చేపపిల్లలను నీటిలోకి వదులుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం కాంట్రాక్టర్లకు బిల్లులు కట్టబెట్టడమే లక్ష్యంగా అధికారుల తీరు ఉందనే ప్రచారం జరుగుతున్నది.

గతేడాది 50 కోట్ల చేపపిల్లలు ఎక్కడ?

గతేడాది బీసీ సంక్షేమశాఖ నుంచి రూ.110 కోట్లు మత్స్య శాఖకు కేటాయించారు. రాష్ట్రంలోని జలాశయాలు, చెరువుల్లో, ప్రాజెక్టుల్లో 80 కోట్ల చేపపిల్లలను పోయాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే, అధికారుల నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, టెండర్ల ఆలస్యంతోనే కేవలం 30కోట్ల చేపపిల్లలను మాత్రమే పోసినట్లు సమాచారం. అంటే కేవలం 40శాతం చేప పిల్లలనే వదిలారు.

టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే సరికి చెరువులు, కుంటల్లోనూ నీటిశాతం తగ్గడంతోనే పోయలేదని మత్స్యకార సొసైటీ నేతలు చెబుతున్నారు. మరోవైపు 50 కోట్ల చేప పిల్లలు ఏమయ్యాయో.. వాటికి కేటాయించిన నిధులు ఎటుపోయాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొన్నదని ప్రశ్నిస్తున్నా రు. చేప పిల్లలకు కేటాయించిన నిధులు మాత్రం ఖర్చుచేసినట్లు సమాచారం.

నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు చేపపిల్లలను వేసినట్లు కాగితాల్లో రాసి, కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల బిల్లులు మంజూరు చేసే వెసులుబాటు లభిస్తున్నది. ప్రతి ఏడాది మత్స్యకారుల పొట్ట కొట్టి, కాంట్రాక్టర్లు, అధికారుల జేబులు నింపడానికే ఈ ఆలస్యపు డ్రామాలు ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. 

భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి..?

వాతావరణ శాఖ అంచనాల ప్రకార ం.. ఏ క్షణంలోనైనా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిస్తే.. అలాంటి పరిస్థితుల్లో చెరువులు, జలాశ యాలు నిండిపోతే వెంటనే చేప పిల్లలను వదలాల్సి ఉంటుంది. కానీ, అప్పటికీ టెండర్లు పూర్తికాకపోతే అత్యవసరంగా పనులు చేపట్టాల్సి వస్తుంది. దాంతో నాణ్యత, పారదర్శకత, సమయ పాలనపై ప్రభా వం పడే అవకాశం ఉంటుంది.

టెండర్లలో ఆలస్యం కారణంగా అత్యవ సరపరిస్థితుల్లో పనులు అప్పగించాల్సి రావ డం వల్ల కొందరు కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. పోటీ తగ్గడం, సమయాభావాన్ని కారణంగా చూపించి పనులు త్వరిత గతిన అప్పగించడం వంటి అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏడాది ఇదే తరహా పరిస్థితి కొనసాగుతుండటంతో ఆలస్యాల వెనుక అసలు కారణాలపై అధికారులే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.