28 July, 2026 | 12:45 AM

కాంగ్రెస్ అధ్యక్ష పదవిని యువతకివ్వాలి

28-07-2026 12:20 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్
  2. విద్యాశాఖ మంత్రి పదవికి రేవంత్ రాజీనామా చేయాలి
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): యువతపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని, రాష్ట్ర విద్యాశాఖను యువకులకు అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని ధ్వంసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీల నుంచి ప్రజలు, జెన్-జీ యువత దృష్టిని మళ్లించడానికే సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడుతూ... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ శాసనసభ్యుడికి అనుభవం అవసరమనే దూరదృష్టితోనే 25 ఏళ్ల వయస్సును నిర్ణయించారని, ఇప్పుడు సీఎం చేస్తున్నది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి నిజంగా యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధే ఉంటే, ముందుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి నుంచి మల్లికార్జున్ ఖర్గేని తప్పించి, ఆ బాధ్యతలను ఏదేని యువ నాయకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు. తమ బీజేపీ ఇప్పటికే నితిన్ నబిన్‌ని జాతీయ అధ్యక్షుడిగా నియమించి, యువతకు తగిన ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా విద్యార్థులు, యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

తెలంగాణలోని 17 ప్రభుత్వ విశ్వవిద్యాల యాలు నిధుల కొరత, అధ్యాపకుల కొరతతో తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని తలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని, విద్యావ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు.

విద్యాశాఖను కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికివ్వాలి

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ.. యువతకు ఇచ్చిన ప్రతి హామీ గాలిలో కలిసిపోయిందని రాంచందర్‌రావు విమర్శించారు. విద్యాశాఖను యువ నాయకుడికి అప్పగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. విద్యాశాఖలో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖమంత్రిగా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి అప్పగించాలన్నారు. దేశవ్యాప్తంగా యువత ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ పైనే విశ్వాసం ఉంచారని, అందుకే బీజేపీ అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు.

కలాంకు నివాళి

మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్’ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు ఘనంగా నివాళులర్పించారు. అలాగే జేఎన్టీయూలో జరిగిన పరిశోధన ఆధారంగా, ప్రొఫెసర్ మల్లికార్జున్, సుజాత సంయుక్తంగా రచించిన ‘శ్రీమన్ భగవద్గీత’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.