28 July, 2026 | 2:00 AM

మా పెద్దిని కాపాడండి

28-07-2026 01:02 AM
  1. ఏంజేస్తరో చేయండి
  2. వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
  3. దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. గుండె చెదురొద్దు, ధైర్యంగా ఉండండి
  4. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్
  5. సుదర్శన్‌రెడ్డికి అందుతున్న అత్యున్నత చికిత్సపై ఆరా
  6. ప్రపంచస్థాయి అత్యుత్తమ చికిత్స అందుతున్నదని తెలిపిన డాక్టర్లు పూర్తి సమాచారం ఇవ్వడానికి 48 గంటలు పడుతుందని స్పష్టీకరణ

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఏం జేస్తరో చేయండి.. మా పెద్ది సుదర్శన్‌రెడ్డిని కాపాడాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ యశోద దవాఖాన డాక్టర్లను కోరారు. తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సోమవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్ ఆయనకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో వాకబుచేశారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి అక్కడ పెద్దికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. ఐసీయూలో ఉన్న ఉద్యమ సహచరుడిని చూసి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు అరగంటపాటు అక్కడే నిలబడి చికిత్స అందుతున్న తీరును డాక్టర్లతో క్షుణ్ణంగా ఆరా తీశారు. సుదర్శన్‌రెడ్డికి ప్రపంచస్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని వైద్యులు తెలిపారు.

గుండె, ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని, కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని, ఇందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని డాక్టర్లు వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా పెద్ది సుదర్శన్‌రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టంచేశారు. 

ధైర్యంగా ఉండండి

డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో సుదర్శన్‌రెడ్డి కోలుకుంటాడని కేసీఆర్ విశ్వాసాన్ని ప్రకటించారు. ఐసీయూలో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం కుటుంబసభ్యుల వద్దకు చేరుకున్న కేసీఆర్, వారికి భరోసాను, ధైర్యాన్ని అందించారు. ఆందోళన చెందవద్దని భార్య స్వప్న, కొడుకు నిదర్శన్‌రెడ్డి, కూతురు ధర్మిష్ట, అన్నలు శ్రీనివాసరెడ్డి, రవీందర్‌రెడ్డి, చెల్లె స్వాతి తదితరులతో మాట్లాడిన కేసీఆర్ వారిలో ధైర్యాన్ని, భరోసాను నింపారు.

అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. దాదాపు 45 నిమిషాలపాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ మీరేం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్‌రెడ్డిని కాపాడండి’ అంటూ డాక్టర్లకు చేతులెత్తి నమస్కరించారు. ఎప్పటికప్పుడు ఎంఆర్‌ఐ తదితర అవసరమైన పరీక్షలు చేస్తూ, డాక్టర్ల బృందం చేత సమావేశాలు నిర్వహించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అత్యున్నత చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.

తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండీ ఏఎస్ రావు, జేఎస్ రావు భరోసా ఇచ్చారు. అంతకుముందుకు మంత్రి సీతక్క యశోద దవాఖానకు వెళ్లి పెద్దికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సుదర్శన్‌రెడ్డి భార్యాపిల్లలను కలిసి ధైర్యం చెప్పారు.

కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, తాటికొండ రాజయ్య, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావుగౌడ్, మాజీ ఎంపీలు వినోద్‌కుమార్, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, పార్టీ నాయకులు గాదరి బాలమల్లు, సతీశ్‌రెడ్డి, రజినిసాయిచంద్, పల్లె రవికుమార్, రాజాంయాదవ్, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేష్, చిరుమల్ల రాకేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.