నూతన పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థికంగా ఎదగాలి
కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, జులై 14 (విజయక్రాంతి): నిరుద్యోగ యువత, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీతో పాటు అన్ని వర్గాల ప్రజలు నూతన పరిశ్రమలు స్థాపించి ఆర్థికంగా ఎదగాలని, సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో టీ ఎస్ ఐ పాస్ ద్వారా వివిధ శాఖలకు సంబంధించి 60 దరఖాస్తులు అందగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి 44 దరఖాస్తులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.
అలాగే ఎస్సీకి చెందిన 5 మంది, ఎస్టీకి చెందిన 30 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల కింద సబ్సిడీ రుణాల మంజూరుకు ప్రతిపాదనలను ఆమోదించినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిస్థితులకు అనుగుణంగా చిన్న, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత ముందుకు రావాలని, ఇందుకు పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, సంక్షేమ శాఖలు, బ్యాంకులు పూర్తి సహకారం అందిస్తాయని తెలిపారు. ప్రతి సంవత్సరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుమారు రూ.600 కోట్ల వడ్డీలేని బ్యాంకు లింకేజీ రుణాలు అందుతున్నాయని, వాటిని పౌల్ట్రీ ఫారాలు, కోల్ స్టోరేజీలు, గోదాములు, రెడీమిక్స్ యూనిట్లు, మక్కజొన్న విత్తనాలు, మిర్చి ఆధారిత పరిశ్రమలు తదితర తయారీ రంగాల్లో వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లాలోని మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య విద్యను అందించాలని అధికారులను ఆదేశించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువత కోసం అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, డీ ఈ ఈ టీ, ఎన్ ఏ టీ ఎస్ తదితర పోర్టళ్లలో యువత తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు శ్రీనివాసరావు, దేశీరామ్ నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, ఫ్యాక్టరీలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు, జిల్లా ఉపాధి కల్పన అధికారి రజిత తదితరులు పాల్గొన్నారు.






