సైబర్ వలకు చిక్కిన సీఏ
21 కోట్లు హాంఫట్
మధ్యప్రదేశ్‌లోని గ్యాలియర్‌లో ఘటన
భోపాల్, జూలై 14: అధిక లాభాల ఆశతో పెట్టుబడిన పెట్టిన ఓ చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) ఏకంగా రూ. 21 కోట్లు పోగొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన 70 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ ఓ 2025 డిసెంబర్‌లో మహిళ ద్వారా వచ్చిన ఫోన్ కాల్‌ను నమ్మి ఆరు నెలలుగా పలు దఫాలుగా పెట్టుబడులు పెట్టాడని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ నయన్ శర్మ వెల్లడించారు.
అవతలి వ్యక్తులు ఆయనను నమ్మించేందుకు నకిలీ లాభాల లెక్కలను ఆన్‌లైన్ ద్వారా చూపిస్తూ వచ్చారన్నారు. సీఏ గత ఆరు నెలలుగా వందకు పైగా జరిపిన లావాదేవీల్లో రూ. 21 కోట్లు పెట్టుబడులు పెట్టాడన్నారు. డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే మోసగాళ్లు సాకులు చెప్పడం ప్రారంభించడంతో అతనికి అనుమానం వచ్చి పోలీసులను సంప్రదించాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, సీఏకు సంబంధించిన రూ. 1.75 కోట్లను స్తంభింపచేశామని, మిగతా సొమ్మును మాత్రం గతంలోనే సైబర్ నేరగాళ్లు కొట్టేశారని డీఎస్పీ సంజీవ్ నయన్ శర్మ తెలిపారు. ఈ సైబర్ మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.






