ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, జూలై 14 (విజయక్రాంతి): ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం, జిల్లాలోని జఫర్గడ్ మండల కేంద్రంలో బిఎల్వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిపై ఆరా తీశారు.
ఫారాలు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా, పూర్తిగా పూరించిన దరఖాస్తులను తిరిగి సేకరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబాన్ని సంప్రదించాలని, ఒక కుటుంబంలో ఒక సభ్యుడి మ్యాపింగ్ పూర్తయితే మిగిలిన అర్హులైన సభ్యులందరికీ మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఫారాలు సమర్పించని కుటుంబాలను గుర్తించి, ప్రత్యేకంగా తిరిగి సంప్రదించాలన్నారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలన్నారు.బిఎల్‌ఓలు ఓటర్లతో మర్యాదగా వ్యవహరించి, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, బిఎల్‌ఓలు, తదితరులు పాల్గొన్నారు.






