విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
మహబూబాబాద్, జులై 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రం అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో అనేక పనులు చేపట్టామని, తాజాగా విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలల భవనాల నిర్మాణాల కోసం 19.10 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తుందని తెలిపారు. విద్య, వైద్యం, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం తాము కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ, మున్సిపల్ చైర్ పర్సన్ గూగులోత్ జ్యోతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.






