25 June, 2026 | 2:30 AM

కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ఎరువులు తెచ్చాం

25-06-2026 01:20 AM

మాజీ ఎంపీ నామ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాభై వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దే 

సత్తుపల్లి, ఖమ్మం, జూన్ 24(విజయ క్రాంతి): పదేళ్ల కేసీఆర్ పాలనలో సాగు, తాగు నీటి కష్టాలు కనపడలేదని బీఆర్‌ఎస్ మాజీ లోక్సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్, సభ్యత్వ నమోదు అవగాహన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు బీఆర్‌ఎస్ పార్టీకి ఇద్దరే పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి కేవలం ఒకటే సీటు గెలిచినా, రాష్ట్ర ప్రజలు అంతా బాగుండాలని, అందులో ఖమ్మం జిల్లా కూడా తనకు సమానమేనని భావించి సుమారు యాభై వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టించారని గుర్తు చేశారు. 

మాయమాటలు, మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మన జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారని, వారు అవినీతి మాయలో పడి కేవలం మాటలు చెప్పడం, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం తప్ప జిల్లా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని తామే చేశామని చెబుతూ ముగ్గురు మంత్రులు తిరుగుతున్నారని విమర్శించారు.

వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి అంతా తానే చేసినట్లు, 40 ఏళ్లుగా ఒక్కడే అన్ని చేశానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు కేసీఆర్ రాజకీయ పునర్జన్మనిచ్చారని, అలాంటి కేసీఆర్ను మోసం చేసి అధికారం కోసం పార్టీలు మారారని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులకు ఎరువుల సమస్యను పరిష్కరించలేకపోతున్నారని, యాప్ల పేరుతో రైతుల ఇబ్బందులు పెంచుతున్నారని విమర్శించారు. 

కేసీఆర్ పాలనలోనే సీతారామ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని అన్నారు.   కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత రాకుండా ముందు చూపుతో రాష్ట్ర రైతాంగానికి అవసరమైన ఎరువుల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారని, ఎంపీలుగా తాము పార్లమెంట్ను స్తంభింపజేసి కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ఎరువులు తీసుకొచ్చి నిల్వలు ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు.  పంట కొనుగోలు విషయంలో కూడా కేంద్రంపై అదే విధంగా పోరాడామని తెలిపారు. 

కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏనుగుల రాకేష్ రెడ్డి, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, దిండిగల రాజేందర్, ఉమ్మడి జిల్లా ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.