కరీంనగర్ జిల్లాను ప్రభుత్వ పథకాల అమలులో అగ్రభాగాన నిలపండి
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి,
జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా
కరీంనగర్, జూన్24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో కరీంనగర్ జిల్లాను అగ్రభాగాన నిలపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు.
ప్రజలతో మమేకమై వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడమే అధికారుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. ప్రజలకు సేవలు అందించడం అధికారుల అదృష్టంగా బావించాలని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గుర్తించిన సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతొ పని చేయాలని సమస్యల పరిష్కారం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అని అన్నారు. ప్రజాపాలనప్రగతి ప్రణాళికను కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయాలని సూచించారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, అద్దె బస్సుల నిర్వహణ వంటి కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోందని తెలిపారు.
గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదేనని స్పష్టం చేశారు. 318 గ్రామపంచాయతీల్లో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు . వ్యవసాయ రంగంలో 1.93 లక్షల మంది రైతులకు రూ.143.35 కోట్లు రైతు భరోసా, 206 రైతు కుటుంబాలకు రూ.14 కోట్ల రైతు బీమా అందించగా, 319 కొనుగోలు కేంద్రాల ద్వారా మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.554 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అని అన్నారు.
సంక్షేమ పథకాల కింద 45,920 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా, 96,775 కొత్త సభ్యుల పేర్లు చేయడం జరిగింది అని అన్నారు . మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.334 కోట్ల ప్రయోజనం, గృహజ్యోతి ద్వారా రూ.153.10 కోట్ల లబ్ధి కల్పించామని , ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 10,209 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, 7,220 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి అని అన్నారు. మెగా జాబ్ మేళాలో 292 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయాని, ప్రజావాణి ద్వారా వచ్చిన 2,995 దరఖాస్తుల్లో 2,144 దరఖాస్తులు పరిష్కరించినట్లు కలెక్టర్ వివరించారు.






