4 July, 2026 | 2:41 AM

రోడ్డు ప్రమాద బాధితురాలికి ‘మేమున్నాం’ చేయూత

04-07-2026 01:42 AM

చర్ల, జులై 3, (విజయక్రాంతి): డబ్బుల్లేక ప్రాణాలు గాల్లో కలిసిపోయే దుస్థితి ఇంకా ఉండటం బాధాకరం. అలాంటి పరిస్థితిలో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి ‘మీకోసం మేమున్నాం’ టీం అండగా నిలిచింది. చర్ల మండలం ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన సోయం రమ (44) ఇటీవల దుమ్ముగూడెం వద్ద జరిగిన బైక్ యాక్సిడెంట్లో తలకు తీవ్ర గాయమై ఖమ్మం ప్రసూన న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు భరించలేక ‘మీకోసం మేమున్నాం’ టీంను ఆశ్రయించారు. సంస్థ సభ్యులు వెంటనే ఫండ్ రైజింగ్ ద్వారా రూ.13,000 సేకరించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం చర్లలోని సంస్థ కార్యాలయంలో సభ్యులు చింతలపాటి అశోక్ గౌడ్ చేతుల మీదుగా బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ  ‘అనుకోని విపత్తు వస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలు కుదేలవుతాయి. అలాంటప్పుడు మనం అందించే చిన్న సాయం కూడా పెద్ద భరోసా ఇస్తుంది. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దొడ్డి తాతారావు, జవ్వాది సతీష్, గొట్టిపాటి శ్రీనివాసరావు, బూహ్యవరపు ప్రతాప్, కవ్వాల రాము, దొడ్డి సూరిబాబు, రామ్మోహన్, సొల్లంగి నాగేశ్వరరావు, ఇర్ప పెద్ద బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.