గోరక్షకుల అరెస్టులను ఖండిస్తున్నాం
- గోవధకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) : బక్రీద్ పండుగను పురస్కరించుకుని తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చట్ట విరుద్ధంగా గోవులను తరలించడం, గోవధకు పాల్పడటం అత్యంత విచారకరమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ, కొందరు కావాలనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవిత్రమైన గోమాతను కాపాడుకోవడానికి, చట్టాన్ని రక్షించడానికి శాంతియుతంగా ప్రయత్నిస్తున్న గోరక్షకులను, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం, బైండోవర్లు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు.
చట్టాన్ని ఉల్లంఘించే వారిని వదిలేసి, గోవులను కాపాడాలని చూస్తున్న రక్షకులపై, బీజేపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, వారిపై చేస్తున్న బైండోవర్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాంచందర్ రావు సూచించారు. చట్టాన్ని ధిక్కరించి గోవధకు పాల్పడే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పోలీసుల పక్షపాత వైఖరి నశించాలని తెలిపారు. పండుగల పేరుతో గోవధను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. తక్షణమే అరెస్టయిన కార్యక ర్తలను విడుదల చేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఉద్యమి స్తామని రాంచందర్ రావు హెచ్చరించారు.
రాంచందర్‌రావు సమక్షంలో చేరికలు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమక్షంలో సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సినీ సెల్ కో-కన్వీనర్ వైభవ సూర్య మాట్లాడుతూ... దేశభక్తి భావజాలం, అభివృద్ధి రాజకీయాల పట్ల ఆకర్షితులై పలువురు కళాకారులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా అనేక మంది సినీ, టీవీ రంగ ప్రముఖులు పార్టీలో చేరనున్నారని చెప్పారు.
ప్రముఖ సినీ నటులు మనోహర్, సీనియర్ నటుడు శరత్, సీనియర్ నటి పద్మరేఖ, అలాగే సినీ సెల్ సభ్యురాలు పూజిత బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంతాలు, ప్రజా సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.






