మహిళా రిజర్వేషన్లపై రాజకీయాలొద్దు
- లోక్‌సభలో బిల్లు పెడితే మద్దతిస్తాం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- సచివాలయం రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళి
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) : మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదు.. తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ వర్థంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఆయన విగ్రహానికి గురువారం సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు.
దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి రాజీవ్‌గాంధీ అని, సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిని గొప్ప దార్శనికుడని కొనియాడారు. తెలంగాణకు గాంధీ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉందని, అది కుటుంబ సంబంధం కంటే ఎక్కువ అన్నారు. సోనియాగాంధీ సాహసోపేత నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందన్నారు.
తెలంగాణ ఉన్నంతవరకు ప్రజలు గాంధీ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మాజీ మంత్రి గీతారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీభవన్‌లో రాజీవ్ వర్థంతి
గాంధీభవన్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో పాటు పలువురు పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీభవన్ ఆవరణలో ఖైరతాబాద్ డీసీసీ అధ్య క్షుడు మోత రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సచిన్ సావంత్, వీ హనుమంత రావు, మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ దేశంలో ఐటీ విప్లవానికి రాజీవ్‌గాంధీనే కారణమని అన్నారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు.






