17 June, 2026 | 2:57 AM

మేం సీఎం రేవంత్‌కు.. జవాబుదారీ కాదు!

17-06-2026 01:44 AM

మేం తెలంగాణ ప్రజలకు జవాబుదారీ

  1. మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు
  2. కిషన్ రెడ్డి వద్దంటే ప్రాజెక్టులు ఆగవు 
  3. మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు
  4. నేను అడ్డుకున్నానని ఏ మంత్రి చెప్పారు? 
  5. మెట్రో ఫేజ్-2కు 50:50 నిష్పత్తిలో సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించింది 
  6. తరచూ ప్రాజెక్టుల విషయంలో మంత్రులను కలుస్తున్నాను 
  7. నాకు భేషజాల్లేవు.. కేంద్ర మంత్రులను కలవడానికి మీతో వచ్చేందుకూ నేను సిద్ధమే 
  8. ఢిల్లీ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): తను వద్దం టే ప్రాజెక్టులు ఆగవని, ఎవరికోసమూ ప్రాజెక్టులను అడ్డుకోబోమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. తెలంగా ణకు వచ్చే ప్రాజెక్టులను దొడ్డిదారిన ఆపే సంస్కృతి బీజేపీకి లేదని, కాంగ్రెస్‌కే ఉండొచ్చని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ ఇస్తుంటే కిషన్‌రెడ్డి ప్రాజెక్టులను అడ్డుపడుతున్నారనడం సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

తెలంగాణ అభివృద్ధి పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, తనతోపాటు ప్రధాని మోదీకి.. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రె స్ పాఠాలు, సర్టిఫికెట్ అవసరంలేదని, తాము రేవంత్ రెడ్డికి జవాబుదారీ కాదని, తెలంగా ణ ప్రజలకు జవాబుదారీగా ఉంటామ న్నారు. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశానికి ఎప్పుడొచ్చినా.. తాను కూడా కలిసి వస్తానని, ఈ విషయంలో తనకు ఎలాంటి భేషజాల్లేవని ఆయన స్పష్టంచేశారు.

మెట్రోకు సంబంధించి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ విషయంలో కూర్చు ని చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా మెట్రో ఫేజ్-౨ను తను అడ్డుకున్నానని ఆరోపించిన  సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి తప్పుడు సమాచారాన్ని ఇచ్చే చేసే ప్రయత్నం చేస్తున్నారని, తాను తరచుగా తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులను కలుస్తున్నానని చెప్పారు.

ఏనాడూ అడ్డుకోలేదు..

సీఎం రేవంత్‌రెడ్డి గత కొన్నిరోజులుగా.. మెట్రోప్రాజెక్టు విషయంలో అనేక రకాలుగా తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తు న్నారని, గత ఏడేళ్లుగా కేంద్ర సహాయమంత్రిగా, కేబినెట్ మంత్రిగా తాను తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేశానని, తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలనే కోరుకున్నాను తప్ప ఏనాడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ.. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తనతో, సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కూడా తెలియజేశారన్నారు. మెట్రో ఫేజ్ కేంద్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లు ఇచ్చిందని, మోదీయే స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తుచేశారు.

దేశంలోని మిగిలిన నగరాల్లాగే.. హైదరాబాద్ విషయంలోనూ.. సాంకేతికతంగా చర్చించి కేంద్రం సహకరిస్తుందని, అంతే తప్ప కిషన్‌రెడ్డి ఆపమంటే ఆపరన్నారు. తాను.. కేంద్రమంత్రులను కలిసి నిధులు రా కుండా ఆపానని సీఎం విమర్శించారని, తా ను కేంద్రమంత్రి ఖట్టర్‌ని కలిసిన ప్రతిసారి మీడియాలో, సోషల్ మీడియాలో వివరాలు పెట్టానని, తాను కలిసిన తేదీలను.. తనకే సీఎం మళ్లీ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 

ప్రాజెక్టులకు కేంద్ర సహకారం ఉంటుంది..

తెలంగాణ అభివృద్ధి పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, ఈ విషయంలో తనకు, మోదీ, కేంద్ర ప్రభుత్వానికి.. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సర్టిఫికెట్లు అవసరం లేదని మండిపడ్డారు. తాను తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటానని, తెలంగాణలో తాము ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. జాతీయ రహదారులైనా, రైల్వేలైనా.. ఇతర మౌలికవసతుల ప్రాజెక్టులైనా, అభివృద్ధి పనులైనా.. కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ బిడ్డగా తాను ఉద్యమాలు చేశానని, అమరణ నిరాహార దీక్ష చేశానని, బిల్లు పాసైన తర్వాతే దీక్ష విరమించినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో ఎవరి సూచనలు మాకు అవసరం లేదని, రూ. 1.75 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మించామని, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు ఇలా అనేక అభివృద్ధిపనులు చేశామన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి విషయంలో.. అభివృద్ధి పనుల కోసం భూసేకరణ కావాలని అడిగినా.. నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి స్పందించలేదన్నారు. 

కేంద్రం కొన్ని మార్పులు సూచించింది..

సీఎం రేవంత్ రెడ్డి అనేకసార్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌ను కలిశారని, అయితే ఆయన కొన్ని మార్పులు సూచించారన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చల ద్వారా.. టెక్నికల్ అంశాలను చర్చించి పరిష్కరించుకోవాలి తప్ప.. కిషన్‌రెడ్డి ఆపితే ఆగవని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు ఆపే సంస్కృతి బీజేపీలో ఉండదని, ఏదైనా చెప్పాలనుకుంటే.. ప్రాజెక్టు విషయంలో మార్పులు అవసరమైతే.. ధైర్యంగా చెబుతాం తప్ప.. ఇలా ప్రాజెక్టులను అడ్డుకోమన్నారు.

తెలంగాణ అభివృద్ధికోసం ప్రాజెక్టులకు సహకరిస్తామని, అందులో సందేహం అక్కర్లేదన్నారు. జనవరి 15న సీఎంకు తాను లేఖ రాశానని, ఇలా అనేక సార్లు లేఖలు రాశానని,  రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్ కోసం ముందుకు రావాలని అందులో పేర్కొన్నానని చెప్పారు. 

ఫైనాన్స్ ఇవ్వొద్దని ఏ మంత్రి చెప్పారు..?

కిషన్ రెడ్డి ఫైనాన్స్ ఇవ్వొద్దని ఏ కేంద్ర మంత్రి చెప్పారో రేవంత్ చెప్పగలరా? అని సవాలు విసిరారు. ఊరికే ఆధారాల్లేని ఆరోపణలు చేయడం సీఎం స్థాయి వ్యక్తికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.. తప్ప విమర్శల ద్వారా సమస్యల పరిష్కారం కాదని హితవు పలికారు. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని, గతంలోనూ మెట్రో విషయంలో కేసీఆర్.. అలైన్ మెంట్ మార్పుపేరుతో 3 ఏళ్లు కాలయాపనచేశారని, ఇవాళ రేవంత్ కూడా ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ నాడు చేసిన విమర్శలనే నేడు రేవంత్ రిపీట్ చేస్తున్నారన్నారు. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వమే లేదు, పాలన లేదు.. రేవంత్‌రెడ్డి వచ్చా కే ప్రజాస్వామ్యం వచ్చిందన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తొలుత మీరిచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు ఏమయ్యాయి? దాని గురించి ఏ నాడూ మాట్లాడ టం లేదు ఎందుకని? అని నిలదీశారు. 

వాళ్లు వాళ్లు తేల్చుకోవాల్సిన అంశం అది.. 

ఐఆర్‌ఎఫ్‌సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) గురించి సీఎం మాట్లాడారని, ఈ రుణాలకు సంబంధించి తాను ఏనాడూ మాట్లాడలేదన్నారు. రూ.13,500 కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చు కుందని, ఇది వాళ్లు, వాళ్లు తేల్చుకోవాల్సిన అంశమన్నారు. అయితే తాను దీనిపై ఖట్టర్‌తో మాట్లాడానని.. మెట్రో ఆదాయంలో ముందుగా ఐఆర్‌ఎఫ్‌సీకి రుణాలను చెల్లించడానికి సీఎం ఒప్పందం కుదుర్చుకున్నారని, దీనిపై కేంద్రం పలు సూచనలు చేసిందన్నారు.

దేశవ్యాప్తంగా అన్ని మెట్రోలు తీసుకున్న అప్పులను ముందే చెల్లించరని.. మెట్రో ఆదాయంలో.. ఆపరేషన్స్, మెయింటేనెన్స్‌కు ఖర్చుచేయాలని, ఆ తర్వాతే రుణాలు చెల్లించాలన్నారు. అయితే ముందుగా లోన్ కట్టడంపై ఆలోచన చేయాలని సీఎంకి సూచించానన్నారు. ముందుగా ఆపరేషన్, మెయింటేనెన్స్ చూడాలని, అప్పుడు మెట్రో మనుగడ సాగిస్తుందని చెప్పానని, దీనికి ముఖ్యమంత్రి అంగీకరించలేదని కిషన్‌రెడ్డి తెలిపారు.  

రూ.11 వేల కోట్లు రుణం ఇచ్చాం.. 

నాడు కేసీఆర్ సహకరించకపోయినా.. ఎంఎంటీఎస్ ఫేజ్ కేంద్ర నిధులతో నిర్మించామని, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో అమలుచేస్తున్నామన్నారు. డీఎంకే ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా.. ఎలాంటి వివక్ష లేకుండా తమ సహకారం ఉంటుందన్నారు.

రేవంత్‌రెడ్డివి దిగజారుడు రాజకీయాలని, తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తెలంగాణ పురోగతికి కట్టుబడి ఉంటామన్నారు.    పన్నెండేళ్లలో రూ. లక్షల కోట్లు రుణాలిచ్చామని వెల్లడించారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు రూ.34వేల కోట్లను అందించామన్నారు.