నేడు ఆరుట్లకు సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సీఎం
- విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్
- నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్
- ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): తన డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అత్యాధునిక వసతులతో రూపొందిన ఈ టీపీఎస్ తెలంగాణ విద్యా రంగంలో నూతన విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆరుట్లకు చేరుకుని తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.
అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అనంతరం అక్కడే జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరగనుంది. ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా తెలంగాణ విద్యకు రోల్ మోడల్‌గా తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దారు.
దశలవారీగా 100 టీపీఎస్ స్కూళ్లు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు.
ప్రస్తుతం ఆరుట్ల స్కూల్లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్లో 600 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేక ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఈ స్కూల్‌లో నెలకొంది.






