17 June, 2026 | 1:57 AM

బిల్లులు క్లియర్ చేస్తాం

17-06-2026 01:04 AM
  1. మూడు, నాలుగు నెలల్లో కాంట్రాక్టర్లకు చెల్లిస్తాం
  2. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి  
  3. కాంట్రాక్టర్లకు అండగా ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి 
  4. రేపు తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ను వాయిదా వేసిన కాంట్రాక్టర్లు

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు రెండు, మూడు నెలల్లో చెల్లిస్తామని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అందుకు కాంట్రాక్టర్లు ఈ నెల 18న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ ఆందోళలనను విరమించుకోవాలని మంత్రి సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు మంగళవారం కాంట్రాక్టర్ల ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరిపారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు భారీగా బకాయిలు పెట్టిందని విమర్శించారు.  కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు.  కాంట్రాక్టర్ల అత్మహత్యలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాపమేనని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన మొత్తం బకాయిలు ఒక దశలో రూ.8,000 కోట్లకు చేరాయన్నారు.

కేవలం ఆర్ అండ్ బి శాఖలోనే గత ప్రభుత్వం రూ.4 వేల  కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు పెట్టిందన్నారు. యాదాద్రి దేవస్థానం నిర్మాణ పనులు చేపట్టిన సంస్థలకు సైతం ఇప్పటికీ రూ.350 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లకు రూ.3 వేల  కోట్లకు పైగా బిల్లులు విడుదల చేశామని, ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని మంత్రి కోమటిరెడ్డి వివరించారు.

ఇప్పటికే రూ.140 కోట్ల మేర చెల్లింపులు జరిపామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో రూ.13,500 కోట్ల వ్యయంతో త్వరలోనే హ్మామ్ రోడ్ల నిర్మాణం చేపడుతామని మంత్రి తెలిపారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని రూ.10,410 కోట్ల వ్యయంతో ఆరు లేన్లు, రెండు సర్వీస్ రోడ్లతో విస్తరించనున్నట్లు తెలిపారు.

భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, త్వరలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల పరిధిలో ఇప్పటికే రూ.20,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు, ఒప్పందాలు పూర్తయ్యాయని, అనేక ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనట్లు మంత్రి తెలిపారు. 

కాంట్రాక్టర్లకు అండగా ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి 

రాష్ర్టంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజా ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాభవన్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎంను కలిశారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై భట్టి సానుకూలంగా స్పందించారు. చిన్న కాంట్రాక్టర్లకు  దశలవారీగా పెండింగ్ బిల్లులన్నింటినీ పూర్తిగా చెల్లించి చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

‘చలో హైదరాబాద్’ వాయిదా: రవీందర్‌రెడ్డి

పెండింగ్ బిల్లుల చెల్లింపులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీతో తాము ఎంతో సంతప్తి చెందామని, ఈ నెల 18న చేపట్టదలచిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ రవీందర్‌రెడ్డి ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా అండగా నిలిచిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు వి సత్యవర్తి, మాజీ జాతీయ అధ్యక్షులు ఎస్.ఎన్. రెడ్డి, మాజీ ఉపాధ్యక్షులు డి.వి.ఎన్. రెడ్డి, సుగుణాకర్ రావు, భాస్కర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ప్రభాకర్, శ్యామ్‌రెడ్డి పాల్గొన్నారు.