యూరియా కోసం రైతుల నిరీక్షణ.. యాప్ సమస్యలతో నానా ఇబ్బందులు
సర్వర్ డౌన్తో బుకింగ్లకు బ్రేక్
సహకార సంఘాల ద్వారా నేరుగా పంపిణీ చేయాలని రైతుల డిమాండ్
నాగిరెడ్డిపేట్, జూన్ 16 (విజయక్రాంతి): మండలంలోని కిచ్చన్నపేట్ సహకార సంఘం (తాండూర్ సొసైటీ) పరిధిలో యూరియా ఎరువు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ యాప్ సాంకేతిక సమస్యలతో రైతులకు తలనొప్పిగా మారింది. బుకింగ్ చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారి సర్వర్ డౌన్ అవుతుండటంతో రైతులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
యాప్లో ఎప్పుడు బుకింగ్ ప్రారంభమవుతుందో ముందస్తు సమాచారం లేకపోవడంతో రైతులు నిరంతరం మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు.కొన్నిసార్లు యాప్ తెరుచుకున్నప్పటికీ వివరాలు నమోదు చేసేలోపే స్టాక్ పూర్తయినట్లు సందేశం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చిన్న, సన్నకారు రైతులు సాంకేతిక పరిజ్ఞానం లేక ఇబ్బందులు పడుతుండగా, పలుమార్లు నమోదు చేసిన వివరాలు మాయమవడంతో మళ్లీ మొదటి నుంచి నమోదు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.
ప్రస్తుతం వానాకాల సాగు పనులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో యూరియా అత్యవసరమని,సమయానికి ఎరువు అందకపోతే పంటల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.యాప్లో బుకింగ్ పూర్తయిన వారికి మాత్రమే ఎరువులు అందుతుండటంతో సాంకేతిక సమస్యల కారణంగా అనేక మంది రైతులు యూరియాకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడింది.
అధికారులు వెంటనే స్పందించి యాప్లోని లోపాలను సరిదిద్దడంతో పాటు,సహకార సంఘాల ద్వారా నేరుగా యూరియా పంపిణీ చేసే విధానాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే తాండూర్ సొసైటీ పరిధిలో యూరియా నిల్వలను పెంచి రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం,వ్యవసాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రైతులకు భరోసా కల్పించాలని రైతులు కోరుతున్నారు.






