నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి
- రైతులకు విత్తనాల పంపిణీ నుంచి పంట కొనుగోళ్లపై అవగాహన అవసరం
- సమగ్ర కార్యాచరణకు అధికారుల ప్రత్యేక కమిటీ
- యాప్ ద్వారానే ఎరువుల కొనుగోలు
- ఎరువుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
- రామగుండం ఎరువులు తెలంగాణకే ఎక్కువగా కేటాయించాలి
- ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల బృందం
- వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు ప్రత్యేక ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అదేశించారు. పంట వేసినప్పటి నుంచే రైతుల వివరాల నమోదు, పంటల వివరాల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలో వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టంచేశారు.
ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్నిరకాల ఫెర్టిలైజర్లను యాప్ ద్వారా బుక్ చేసే విధానం తీసుకురావాలని ఆదేశించారు. యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా పంపిణీ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మంగళవారం వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి , వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఉన్న అనుభవాలు, రైతులు ఇబ్బంది పడకుండా చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిషన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వ్యవసాయ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఇప్పుడే ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని అదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, సివిల్ సప్లయ్ శాఖ ఎండీ , ప్లానింగ్ విభాగం కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు.
రైతుల వివరాలు, పంటల నమోదు చేయాలి
విత్తనాల పంపిణీ మొదలు పంట వేసినప్పటి నుంచే అన్ని గ్రామాల్లో రైతుల వివరాల నమోదు, పంటల వివరాల రికార్డులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. పంట ఉత్పత్తుల అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందన్నారు. ‘క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు ఈ ప్రక్రియకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటుంది.
ఏ రైతు ఏ పంట వేశాడు. ఏ గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలు కచ్చితంగా క్షేత్ర స్థాయి పరిశీలనతో నమోదు చేయాలి’ అని సీఎం చెప్పారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాలను అనుసరించి రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
సబ్సిడీపై సన్న వడ్ల విత్తనాలు
7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రైతు వేదికల్లోనే సన్న వడ్ల విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు వేదికలను ఇకపై రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాల్లో వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు.
సాంకేతికత వినియోగం పెంచుకోవాలి
వ్యవసాయ శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచుకోవాలని సీఎం సూచించారు. ఏఐ ఆధారిత విధానాలను సమర్థంగా వినియోగించాలని చెప్పారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని విత్తనాల నుంచి కొనుగోళ్ల వరకు మొత్తం వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయం తో పనిచేయాలని చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు అధ్యయ నం చేయాలని, రైతులకు ఉపయోగంగా ఉంటే మరింత విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. ఖరీఫ్‌కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం సూచించారు.
రామగుం డం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావా ల న్నారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి, వాస్తవ పరిస్థితిని వివరించాలన్నారు. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని చెప్పారు.
మార్కెఫెడ్ నష్టాల తగ్గింపునకు చర్యలు
మార్క్‌ఫెడ్‌ను నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యాపారులకు తలొగ్గకుండా ఈసారి ప్రభుత్వం వ్యూహత్మకంగా వ్యవహరించిన కారణంగా మొక్కజొన్న కొనుగోళ్లతో వచ్చే నష్టం తగ్గించగలిగామని సీఎం వివరించారు.
గతంలో రూ. 13 వేలకు టన్ను అమ్మిన పరిస్థితి ఉందని.. ఈసారి దాదాపు రూ. 21 వేల కు పైగా టెండర్ రేట్ వచ్చిందన్నారు. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపే తం చేసి లాభలదిశలో నడిపించాలని అధికారులకు ఆదేశించారు. ప్ర భుత్వ డెయిరీని మరింత బలోపేతం చేయాలని సీఎం స్పష్టం చేశారు.






