17 June, 2026 | 3:28 AM

హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు

17-06-2026 02:09 AM
  1. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులే
  2. గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి
  3. సిపిఐ రాష్ట్ర  కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

మహబూబాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వానికి తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర  కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. హనుమకొండలోని గుండ్ల సింగారం భూపోరాట కేంద్రంలో మంగళవారం సురవరం సుధాకర్ రెడ్డి నగర్ పేరుతో నిర్మించిన సీపీఐ కార్యాలయాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు అమలు చేయడం లేదన్నారు.

రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా పేదవాడి జీవితం మార లేదన్నారు. పేదలు సీపీఐ ఆధ్వర్యంలో అనేక చోట్ల భూపోరాటాలు నిర్వహించి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనన్నారు. పాలకులు పేదల అనుకూల విధానాలను అవలంబించడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొన వద్దంటూ పేదలకు నీతులు చెబుతూ పెద్దలకు అనుకూలంగా మెదులుతున్నారని విమర్శించారు.

కమ్యూనిస్టుల మద్దతు ఉంటేనే ప్రభుత్వాలు మనగలుగుతాయన్నారు. కమ్యూనిస్టులు లేకుంటే తెలంగాణాకే విముక్తి జరిగేది కాదని అన్నారు. గుండ్ల సింగారంలో ఎంతో దీక్ష, పట్టుదలతో కాలనీ నిర్మించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని, కాలనీలో నివసిస్తున్న పేదలందరికీ ఇండ్ల పట్టాలు వచ్చేలా తాను అధికారులతో, స్థానిక ఎమ్మెల్యేతో అవసరం అయితే సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, మద్దెల ఎల్లేష్, అదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, వలీ ఉల్లాఖాద్రి, ఎన్.ఎ స్టాలిన్, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, బత్తిని సదానందం, మునిగాల బిక్షపతి, మాలోత్ శంకర్, శనిగరపు రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.