నీట్ యూజీ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించాలి
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎన్‌ఎస్‌యూఐ వినతి
ఖైరతాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఎన్టీఏ నిర్లక్ష్యం కారణంగా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని ఎన్‌ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకట్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో జూన్ 21న నిర్వహించనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మంగళవారం కలిసి వినతిపత్రం అంద జేశారు. పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు అదనపు రవాణా ఖర్చులు భరించాల్సి వస్తోందని మంత్రికి వివరించారు.
ఎన్‌ఎస్యూఐ వినతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థులకు లబ్ధి చేకూరేలా అనుకూల నిర్ణయం తీసుకునేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి సానుకూల స్పందనకు ఎన్‌ఎస్యూఐ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్యూఐ జాతీయ లీగల్ సెల్ కోఆర్డినేటర్ అక్బర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకేష్ కర్ణాకర్, హస్సన్, విష్ణువర్ధన్, వికాస్, ధీరజ్ పాల్గొన్నారు.






