17 June, 2026 | 3:08 AM

సమాచార హక్కు చట్టాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలి

17-06-2026 01:45 AM

ప్రతి పౌరుడికి సమాచారం తెలుసుకునే హక్కు ఉంది

30 రోజుల్లో సమాచారం అందకపోతే ఉచితంగా ఇవ్వాలి

రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. చంద్రశేఖర్ రెడ్డి

పెద్దపల్లి, జూన్ 16 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రభుత్వ శాఖలు దీనిని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి ఐడీఓసీలో జిల్లా అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్టీఐ ఒక శక్తివంతమైన సాధనమని, సెక్షన్-3 ప్రకారం ప్రతి పౌరుడికి ప్రభుత్వ సమాచారం పొందే హక్కు ఉందని గుర్తు చేశారు.

ఫీజు మినహాయింపు తెల్ల రేషన్ కార్డు కలిగిన బీపీఎల్ కుటుంబాలకు ఆర్టీఐ దరఖాస్తులపై ఎటువంటి ఫీజు అవసరం లేదని,చట్ట ప్రకారం దరఖాస్తును 30 రోజుల్లోపు పరిష్కరించాలని, గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి మొదటి రెండో అప్పీలేట్ అథారిటీల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని,ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే థర్డ్ పార్టీ సమాచారాన్ని కూడా వెల్లడించవచ్చని తెలిపారు.

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4 (స్వచ్ఛంద సమాచార ప్రకటన) నుండి సెక్షన్ 28 వరకు ఉన్న అన్ని నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, సమాచారాన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తూచా తప్పకుండా పాటించాలని, పారదర్శకమైన పాలన అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 570 మందికి పైగా ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్ అథారిటీలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, అదనపు కలెక్టర్లు, డిసిపి రాంరెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.