నీటమునిగిన ‘విరాట్-1'
14 మంది భారత నావికులు సురక్షితం
అమెరికా నావికాదళం రెస్క్యూ
మస్కట్, జూన్ 14 (విజయక్రాంతి): ఒమన్ తీరానికి 80 మైళ్ల దూరంలో భారత సిబ్బందితో ప్రయాణిస్తున్న విరాట్ ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న 14 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా ఉన్నట్లు ఒమన్ భారతీయ రాయబార కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపింది.
ఆదివారం ఉదయం రాస్ అల్ హద్‌కు 80 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న విరాట్1 ఇంజన్ వైఫల్యం వల్ల మునిగిపోయింది. వెంటనే నౌకలోని సిబ్బందిని సురక్షితంగా కాపాడేందుకు చుట్టుప్రక్కల, దగ్గరలో ఉన్న నౌకలకు, గస్తీ నౌకలకు సమాచారం ఇచ్చామని, వారితో సమన్వయం చేసుకున్నామని తెలిపింది. అమెరికా నేవీకి చెందిన పీ8 వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందిని సురక్షితంగా రక్షించారని తెలిపింది. ఎంవి జబల్ అలీ 9 అనే నౌక సంఘటనా స్థలానికి బయలుదేరగా, సహాయక చర్యలకు మద్దతుగా భారత నౌకాదళ నౌకలను కూడా మళ్లించారు.
ఒమన్ అధికారుల సమన్వయం, సమీపంలోని నౌకల ద్వారా సహాయక విరాట్ 1 వద్ద సహాయక చర్యలు చేపట్టామని పేర్కొంది. సిబ్బంది సురక్షితంగా ఇతర నౌకల్లోకి మారగానే విరాట్ 1 నౌక మునిగిపోయినట్లు తెలుస్తుంది. ఇటీవల ఒమన్ తీర ప్రాంతానికి సమీపంలో ఓ నౌకలో విధులు నిర్వహిస్తున్న తమిళనాడుకు చెందిన నిశాంత్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీనిపై కూడా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ప్రయత్నాలను ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.






