ప్రజాసేవకుడు భట్టివిక్రమార్క
‘న్యాయాత్పథః ప్రవిచలంతి పదం న ధీరాః’ ధీరులు, నిబద్ధత గల నాయకులు ధర్మం, న్యాయం అనే మార్గాల నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు తప్పరు. ఈ సూక్తికి తెలంగాణ రాజకీయాల్లో సజీవ సాక్ష్యంగా నిలిచిన నేత ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క. రాజకీయాల్లో పదవులు అలంకరించడం సహజమే.. కానీ, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం మాత్రం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన నాయకత్వానికి ప్రతీక భట్టి.
ఉద్యమాల నుంచి అధికార బాధ్యతల వరకు ఆయన సాగించిన ప్రయాణం కేవలం రాజకీయ ప్రస్థానం కాదు, ప్రజల కష్టాలతో మమేకమైన సాగిన ఒక సేవాయజ్ఞం. తెలంగాణ ఆవిర్భవించిన 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక దిక్సూచిగా నిలిచిన మహోన్నత నేత. అప్పటి ప్రభుత్వంపై ప్రజా సమస్యలపై రాజీపడకుండా భట్టి రాజీ లేని పోరాటం సాగించారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆవేదనలు, గిరిజనుల భూహక్కులు, సంక్షేమ పథకాల అమలులో లోపాలు, విద్యా-వైద్య రంగాల సమస్యలు... ఇలా ప్రతి అంశాన్ని అసెంబ్లీ వేదిక నుంచి ప్రజాక్షేత్రం వరకు.. అన్నిచోట్ల గళమెత్తారు.
ప్రజల కోసం పోరాడిన ప్రతిపక్ష నేత
ప్రతిపక్ష ఉపనేతగా -టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, అనంతరం కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా భట్టి విక్రమార్క పోషించిన పాత్ర తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. కేవలం విమర్శలతో కాకుండా వాస్తవాలు, గణాంకాలు, ప్రజల అనుభవాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఘనత ఆయనది. దళితులు, గిరిజనులు, రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను సభలో సమర్థంగా వినిపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లిన సందర్భాల్లో ఆయన పోరాటం ఒక చారిత్రాత్మక అధ్యాయం. విపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను నిరసిస్తూ నిర్వహించిన సత్యాగ్రహ దీక్ష ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై ఆయనకున్న నిబద్ధతకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.
విపత్కర వేళల్లో ప్రజల వెన్నంటే
కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో ప్రజాప్రతినిధులలో చాలామంది ఇళ్లకే పరిమితమైపోయినప్పటికీ, భట్టి విక్రమార్క మాత్రం ప్రజల మధ్యే ఉన్నారు. వలస కార్మికుల బాధలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన కుటుంబాలకు అండగా నిలిచారు. భట్టి రాజకీయ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర.
ఆదిలాబాద్ అంచుల నుంచి ఖమ్మం వరకు సాగిన ఈ మహా పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో ఒక విశేష ఘట్టంగా నిలిచింది. 108 రోజుల పాటు మండుటెండలను సైతం లెక్కచేయకుండా 1,364 కిలోమీటర్లకు పైగా నడిచిన ఈ యాత్ర కేవలం రాజకీయ కార్యక్రమం కాదు.. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునే సామాజిక అధ్యయనం. గిరిజనుల పోడు భూముల సమస్యలు, నిరుద్యోగుల నిరాశ, మహిళల ఆర్థిక కష్టాలు, రైతుల ఆవేదనలు అన్నింటినీ ఆయన స్వయంగా విన్నారు. ఆ యాత్రలో ప్రజలు చెప్పిన సమస్యలే నేడు ప్రభుత్వ విధానాల రూపకల్పనకు పునాదులయ్యాయి.
మాట ఇచ్చి.. నిలబెట్టుకున్న పటిమ
ప్రజా క్షేత్రంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడమే నిజమైన నాయకత్వానికి కొలమానం. ఆ ప్రమాణంలో భట్టివిక్రమార్క ప్రత్యేకంగా నిలుస్తారు. ఇందిరమ్మ ఇళ్లు, రూ.500కి గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు, మహిళా సాధికారత కార్యక్రమాలు వంటి అనేక హామీల అమలులో భట్టి పాత్ర కీలకం.
ఒకప్పుడు అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రశ్నించిన నాయకుడు, నేడు రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖలకు నాయకత్వం వహిస్తూ పరిష్కారాల దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం చెమటోడ్చిన అనుభవమే నేడు ఆయన పాలనా దృక్పథానికి బలమైన పునాదిగా మారింది. రాజకీయాల్లో హుందాతనం, నిర్ణయాల్లో ధైర్యం, ప్రజల పట్ల అంకితభావం, విమర్శల్లో సంయమనం, సేవలో నిబద్ధత.. ఈ లక్షణాల సమ్మేళనమే భట్టి వ్యక్తిత్వం.
పదవులు మారవచ్చు.. బాధ్యతలు మారవచ్చు.. కానీ, ప్రజల పట్ల అంకితభావం మారకూడదు. ఆ సూత్రాన్నే తన రాజకీయ జీవితానికి మార్గదర్శకంగా చేసుకున్న నాయకుడు భట్టివిక్రమార్క. ప్రజాసేవను జీవిత ధ్యేయంగా భావిస్తూ క్షేత్రస్థాయి శ్రామికుడిగానే కొనసాగుతున్న ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
శేషుబాబు, డిప్యూటీ సీఎం భట్టి పీఆర్వో






