కోటిమంది కోటీశ్వరులా?
ముందు ఒక్కో మహిళకు రూ.1.50 లక్షలు చెల్లించండి
- యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి
- హామీలు నెరవేరిస్తే పదవికి రాజీనామా చేస్తా
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
- రెండున్నర ఏళ్లయినా ఒక్క హామీ నెరవేర్చలేదు
- కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ సినిమా.. వారికి మిగిలింది ఎండ్ కార్డే
- సొంత పార్టీ నేతలకే రేవంత్ వెన్నుపోటు
- ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక ఖాయం
- నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ‘కోటి మంది మహిళలను కోటీశ్వ రులను చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.. ముందుగా వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2,500 చొప్పున గడిచిన రెండున్నర ఏళ్లు, వచ్చే రెండున్నర సంవత్సరాలకు సంబంధించి ఒక్కొక్కరికీ రూ.1.50 లక్షలు ఇవ్వాలి. అదే విధంగా రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.4వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాం డ్ చేశారు. హామీలను నెరవేర్చితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబం ధించి ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ. 1.25 లక్షలు బాకీ ఉందన్నారు.
రేవంత్‌రెడ్డి పాలనను అట్టర్ ఫ్లాప్‌గా కేటీఆర్ అభివర్ణించారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ప్లాప్ అని తెలిసినట్లే, కాంగ్రెస్ ప్రభు త్వం ఇంటర్‌వెల్‌కే ప్లాప్ అని తేలిపోయిందని, మిగిలింది ఎండ్ కార్డు మాత్రమేన న్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఒక్క హామీని కూడా అమలు చేయ లేదని విమర్శించారు.
అధికారంలోకి వచ్చి న మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటివరకు 4 వేల ఖాళీలు కూడా భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి రూ. 4వేల హామీని కూడా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ప్రజలు కేటీఆర్, కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారని విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి.. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఎందు కు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజ లు కాంగెరస్ అసమర్థ పాలనను ఇంకా రెండున్నర ఏళ్లు భరించాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ప్రజలు ఎన్ను కున్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకొని ప్రజాతీర్పును అవమానించారని ఆరోపించారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పి బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయటం కాంగ్రెస్‌కు సాధ్యం కాదన్నారు.
మీనాక్షి నటరాజన్‌పై దొంగ కేసు!
సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి రేవంత్ అని.. కేటీఆర్ విమర్శిం చారు. మీనాక్షి నటరాజన్‌పై తప్పుడు కేసు పెట్టించడం రేవంత్‌రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. మీనాక్షి నట రాజన్ నిజాయితీగల మనిషి, రాహుల్‌గాంధీకి నమ్మినబంటు అని పొగుడు తూనే.. ఆమెపై రేవంత్‌రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు.
తెలంగాణలో భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడు, అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నాడని మీనాక్షి నటరాజన్ రాహుల్‌కు ఫిర్యాదు చేసినందుకే రేవంత్ పగపట్టి, ఆమెపై హైదరాబాద్‌లో దొంగ కేసు పెట్టించి, ఆ వివరాలు బీజేపీకి ఇచ్చారని పేర్కొన్నారు. రేవంత్ చేసిన కుట్ర సమాచా రం తెలియక ఆమె రాజ్యసభకు నామినేషన్ వేసిందన్నారు. సొంతపార్టీ నేతలకే గుండుకొట్టి, శఠగోపం పెట్టిన దొంగ రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. పేదలకు కొత్తగా ఒక్క ఇల్లు కూడా కట్టించకుండా.. హైడ్రా పేరుతో ఉన్న ఇండ్లను కూల్చ డం దుర్గార్గమన్నారు.
కాంగ్రెస్ పాలనలో విద్యుత్, తాగునీటికి కటకట
2014కు ముందు వేసవి వచ్చిందంటే హైదరాబాద్‌లో కరెంట్, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉండేవని కేటీఆర్ గుర్తు చేశారు. బిందెలతో జనం ధర్నా చేసే పరిస్థితి ఉండేదన్నారు. కేసీఆర్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. 24 గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేశామని, ఇంటింటికీ రక్షిత మంచినీటిని సరఫరా చేశామని పేర్కొన్నారు. వైద్యరంగం అభివృద్ధికి బీఆర్‌ఎస్ విశేష కృషి చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు.
నాలుగు టిమ్స్ ఆస్పత్రులు, వెయ్యి పడకల ఆస్పత్రి, 350 బస్తీ దవాఖానల ఏర్పా టు, బసవతారకం ఆస్పత్రిలో ధర్మశాలల నిర్మాణం,.. ఇలా మరెన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ఒక్క పెద్ద ఆస్పత్రి కూడా నిర్మించపోవడం వారి అసమర్థతకు నిదర్శనమన్నా రు. రూ.5 అన్నపూర్ణ భోజన పథకం ప్రారంభించామని, ఈ పథకం పేరును తొలగించి ఇందిరమ్మ పేరు పెట్టడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
చరిత్ర కలిగిన పార్టీ బీఆర్‌ఎస్ : తలసాని శ్రీనివాస్‌యాదవ్
ఎంతో చరిత్ర కలిగిన ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్ అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సుదీర్భ పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిని గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకుంటే రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యేవారేనా? అని ప్రశ్నించారు. ఉన్న సిటీలో నీళ్లివ్వలేని రేవంత్‌రెడ్డి.. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తారా? అని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే ఖైరతాబాద్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఉప ఎన్నిక వస్తే గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని, పజా సమస్యలపై పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కూడా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఖైరతాబాద్ ఉపఎన్నికకు సిద్ధం కావాలి
దానం నాగేందర్ వల్ల ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక రావడం ఖాయ మని, గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాదిరిగా దొంగ ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని, ఇప్పటి నుంచే బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబి తా ప్రత్యేక సమగ్ర సరవణ నేపథ్యంలో బాధ్యతంగా పనిచేయాలని, ప్రతి ఓటను కీలకంగా భావించాలని సూచంచారు.
రికార్డు స్థాయిలో పార్టీ సభ్యత్వం చేయించాలని కోరారు. త్వరలో కొత్త కమిటీలు వేస్తామని, ఆశావహులు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలన్నారు. జనగణన, ఓటరు నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారికి దిశానిర్దేశం చేశారు.






