15 June, 2026 | 3:55 AM

టార్గెట్ తెలంగాణ!

15-06-2026 02:39 AM

ప్రధాన రాజకీయ అస్త్రాలు

  1. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల అభివృద్ధి నమూనా
  2. లోక్‌సభ స్థానాల పునర్విభజన
  3. మహిళా రిజర్వేషన్ బిల్లు
  4. జమిలి ఎన్నికలు (ఒకే దేశం- ఒకే ఎన్నిక)
  5. కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు
  6. జాతీయత, జాతీయ భద్రతా అంశాలు
  7. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ప్రచార శైలి
  8. పార్టీ వద్ద ఉన్న భారీ ఆర్థిక, సంస్థాగత వనరులు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే బీజేపీ లక్ష్యం

జమిలి ఎన్నికలు కలిసి వచ్చే అవకాశం.. సరికొత్త వ్యూహంతో రంగంలోకి కమల దళం

అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఇతర రాష్ట్రాల్లో పార్టీ రాజకీయ కార్యక్రమాలకు నిధులు సమకూర్చే ‘ఏటీఎం‘గా ఉపయోగిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేరళం, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకలాపాలకు ఇప్పటికే తెలంగాణ వనరులు వెళ్లాయనేది ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలో ఉందని, లోటు బడ్జెట్, రుణభారం, ప్రపంచ బ్యాంకు సంస్థలతో సంప్రదింపులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యా లను బీజేపీ మరింత బలంగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అఖండ విజయాలు సాధించింది. ఇదే ఒరవడిలో తెలంగాణలోనూ బావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నేతలంతా తెలంగాణలోనూ కమల ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తద్వారా పార్టీ కేడర్‌కు అధికారంపై బలమైన విశ్వాసం కలిగిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా నిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే జనం మధ్యకు వస్తున్నారు. తద్వారా పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. 

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): పశ్చిమ బంగాల్, కేరళం, పుదు చ్చేరి వంటి రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీ రెట్టింపు ఉత్సాహం ముందుకు సాగుతున్నది. ఇదే ఒరవడిలో తెలంగాణపై మరింత పట్టు సాధించే దిశగా పావులు కదుపుతున్నది. రెండేళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నది. 2028 నవంబర్‌లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, జమిలి విధానంలో 2029 లోక్‌సభ ఎన్నికలతో కలిసే అవకాశం ఉండటంతో ఆ పార్టీ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

బీజేపీకి రాజకీయపరంగా హైదరాబాద్ అనే ఆర్థిక శక్తి కేం ద్రంలా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ రణరంగమని చెప్పొ చ్చు. 2023 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) సుమారు రూ.15.2 లక్షల కోట్లుగా ఉండగా, 2024 ఈ అంచనాలు రూ.16.41 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత కొన్నేళ్లుగా 7.5 నుంచి 8 శాతం మధ్య వృద్ధిరేటుతో దేశంలోనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ, ఐటీఈఎస్ రంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారా యి. సేవారంగం ఒక్కటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో దాదాపు 65 శాతం వాటా కలిగి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిట న్ ప్రాంతం రాష్ట్ర జీడీపీలో సగానికి పైగా వాటా అందిస్తోంది. భారీ పెట్టుబడులు, అధిక విలువ గల భూ లావాదేవీలు, పెరుగుతున్న తలసరి ఆదాయం తెలంగాణను ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా నిలబెట్టాయి.

కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ ఆరోపణలు 

అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఇతర రాష్ట్రాల్లో పార్టీ రాజకీయ కార్యక్రమాలకు నిధులు సమకూర్చే ‘ఏటీఎం‘గా ఉపయోగిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకలాపాల కోసం తెలంగాణ వనరులను వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థి క పరిస్థితి ఒత్తిడిలో ఉందని, లోటు బడ్జెట్, రుణభారం, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలతో సంప్రదింపులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శకులు చెబుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని ముందుకు తెస్తూ ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నది. అయితే.. ఈ ఆర్థిక, రాజకీ య వాదోపవాదాలన్నీ తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వంపై పరిపాలనా దుర్వినియోగం అనే అంశాన్ని బలపర్చేందుకు బీజేపీకి అవకాశంగా మారుతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో సాధించిన విజయాల తర్వాత బీజేపీ నాయకత్వం తెలంగాణను తదుపరి ప్రధాన లక్ష్యమని ప్రకటిస్తున్నది.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణలో కూడా కమల ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలా పాలకు మరింత ఊపు తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జాతీయ నాయకత్వం తరచూ తెలంగాణ పర్యటనలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా త్వరలో హైదరాబా ద్ పర్యటనకు రానున్నట్టు తెలుస్తున్నది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలూ పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందనే సంకేతాలను ఇస్తున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకుని పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సంస్థాగత పున ర్వ్యవస్థీకరణ పూర్తయిన తర్వాత 2026 అక్టోబర్ నుంచి తెలంగాణపై మరింత కేంద్రీకృత వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్‌సభ స్థానాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని రూపొందించే బాధ్యత ఆయనపై పడనుంది. ఇతర రాష్ట్రా ల్లో పార్టీ విస్తరణకు అనుసరించిన నమూనాలను తెలంగా ణ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడంపై కూడా పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికల సమయానికి సమీపంలో పద వీకాలం ముగిసే రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వ్యూహానికి జాతీయ రాజకీయ ప్రాధాన్యత మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఉనికి కోల్పోయే అంచున ఉన్న టీఎంసీలో సునీల్ బన్సల్ ఏ విధంగా అయితే చీలిక తీసుకొచ్చారో, అదే విధంగా తెలంగాణలో పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టడమే బీజేపీ నాయకత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఫిరాయింపులు, పొత్తులు

తెలంగాణలో బీజేపీ వ్యూహంలో కీలక భాగంగా ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులను ఆకర్షించే ప్రయత్నా లు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని సీనియర్ నేతలను తమవైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థులను బలహీనపరచడంతో పాటు స్థానిక స్థాయిలో పార్టీ బలాన్ని పెంచుకోవాలని పార్టీ ప్రయత్నించవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో కలిసి సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ పొత్తుల అవకాశాలను పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతీయ ఆత్మగౌరవ భావనలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేయవచ్చు.

పరిస్థితులను బట్టి పార్టీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రధానంగా ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కేంద్రం, -రాష్ట్రం ఒకే పార్టీ చేతుల్లో ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, హైదరాబాద్ ఐటీ రంగ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళా సాధికార తకు నిదర్శనంగా చూపిస్తూ, మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు కూడా చేయవచ్చు.

జనాభా లెక్కల అనంతరం జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) ప్రక్రియ వల్ల లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాన్ని కూడా బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడవచ్చు. పార్లమెంటరీ బలాన్ని పటిష్టం చేసుకునేందుకు, పరోక్షంగా రాష్ట్రాల్లో ప్రచారాలకు సహాయపడేలా టీఎంసీ లేదా డీఎంకే ఎంపీలను చేర్చుకోవడం వంటి దూకుడు చర్యలకు కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. 

సమకాలీన ఎన్నికల చర్చ

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘జమిలి ఎన్నికలు‘ లేదా ‘ఒకే దేశం ఎన్నిక‘ విధానంపై కూడా రాజకీయ చర్చ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ అం శాలు, కేంద్ర నాయకత్వ ప్రభావం మరింత పెరుగుతుందని బీజేపీ ఆశిస్తున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఎన్నికలకు ముందు బీజేపీయేతర, కొన్ని ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలపై జరుగుతున్న చర్చలు పూర్తిగా రాజకీయ విశ్లేషణలకే పరిమితమని, అలాంటి నిర్ణయాలు రాజ్యాంగపరమైన, న్యాయపరమైన, రాజకీయప రమైన అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే రాష్ట్రపతి పాలన విధించ డం ద్వారా ఎవరూ ప్రశ్నించలేరు. దీంతో లోక్‌సభ ఎన్నికలతోపాటు అనేక రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిం చేందుకు బీజేపీ ప్రణాళిక వేయవచ్చు. ఎందుకంటే ఈ చర్య బీజేపీకి బలమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. దేశం మొత్తం దాని నియంత్రణలో ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా లోక్‌సభలో తన సీట్ల సంఖ్యను పెంచుకునేం దుకు బీజేపీకి సహాయపడుతుంది.

ఈ క్రమంలో బీజేపీయేతర కూటమికి నాయకత్వం వహిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు ఏమాత్రం అవకాశం ఉండదు. సమకాలీన ఎన్నికలు జరిగితే ప్రధాని వ్యక్తిగత ప్రజాదరణ, జాతీయ భద్రత, అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఉపయోగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అదే సమయంలో ప్రతిపక్షాలు ప్రాంతీయ అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలు, స్థానిక సమస్యలను ముందుకు తెచ్చే ప్రయత్నం చేయనున్నాయి. మొత్తంగా ఫిరాయింపులు, సంస్థాగత బలోపేతం, డబుల్ ఇంజిన్ నినాదం, మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, జమిలి ఎన్నికల వంటి అంశాలు తెలంగాణలో పార్టీ రాజకీయ వ్యూహంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హోరాహోరీ పోరు

రాబోయే రోజుల్లో ఫిరాయింపులు, పొత్తులు, సిద్ధాంతపరమైన ప్రచారాలు, అభివృద్ధి అజెండాలు, సంక్షేమ పథ కాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధి అంశాలపై తన పనితీరును సమర్థించుకోనుండగా, బీఆర్‌ఎస్ తిరిగి బలపడేందుకు ప్రయత్నించనుంది.  2028 ఎన్నికల నాటికి బీజేపీ సంస్థాగత బలం, కేంద్ర నాయక త్వ ప్రభావం, ఆర్థిక వనరులు, రాజకీయ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయనేదే తెలంగాణలో పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే రాబోయే రెండేళ్ల రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల దిశను నిర్ధారించబోతున్నాయి.

తెలంగాణపై బీజేపీ దృష్టి కేవలం ఒక ఎన్నిక గెలవడానికే పరిమితం కాదు. దక్షిణాదిలో తన రాజకీయ ప్రభావాన్ని మరింత విస్తరించుకునేందుకు తెలంగాణను వ్యూహాత్మక కేంద్రంగా పార్టీ చూస్తున్నది. అయితే.. బలమైన ప్రాం తీయ రాజకీయ శక్తులు, స్థానిక సామాజిక సమీకరణాలు, సంక్షేమ రాజకీయాలు, తెలంగాణ ఆత్మగౌరవ భావోద్వేగాల మధ్య బీజేపీ తన లక్ష్యాన్ని ఎంతవరకు సాధిస్తుందనేది రాబోయే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

సవాళ్లు.. క్షేత్రస్థాయి వాస్తవాలు

తెలంగాణలో బీజేపీ ప్రయాణం అంత సులభం కాదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పరిశీలిస్తే, కొన్ని ప్రాంతాల్లో పార్టీ విజేత కంటే ఓట్ల చీలికకు కారణమైన శక్తిగా బీజేపీ పనిచేసిందనే విమర్శలున్నాయి. దీనివల్ల కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్‌కు లాభం చేకూరగా, మరికొన్ని ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ బలమైన కేడర్‌ను ఎదుర్కోవడంలో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంది. తెలంగాణ రాజకీయాలు ఇప్పటికీ ప్రధానంగా ప్రాంతీయ శక్తుల చుట్టూనే తిరుగుతున్నాయి.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఉద్యమ పునాది, కాంగ్రెస్‌కు సంక్షేమపరంగా బలమైన రాజకీయ ప్రస్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించాలంటే, కేవలం పట్టణ ప్రాంతాలకు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ కేడర్ బలపడాల్సి ఉంది. అలాగే, సామాజిక వర్గాలు, ప్రాంతీయ భావోద్వేగాలు, తెలంగాణ ఉద్యమ వారసత్వం వంటి అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని సవాళ్ల మధ్య కూడా బీజేపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. కర్ణాటకతో పాటు దక్షిణ భారత రాజకీయ పరిణామాల ప్రభావం తెలంగాణపైనా పడుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

క్షేత్రస్థాయి సంస్థాగత బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ భద్రత అంశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం వంటి అంశాలను దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ వంటి భారీ ఆర్థిక కేంద్రం, తెలంగాణ ఆదాయ సామర్థ్యం, పెట్టుబడుల ఆకర్షణను దృష్టిలో ఉంచుకుంటే రాష్ట్రంలో అధికారాన్ని సాధించడం బీజేపీకి కేవలం మరో రాష్ట్రాన్ని గెలుచుకోవడమే కాదు, దక్షిణ భారతదేశంలో తన రాజకీయ విస్తరణకు కీలక మైలురాయిగా మారనుంది.

తెలంగాణలో బీజేపీ వ్యూహంలో కీలక భాగంగా ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులను ఆకర్షిం చే ప్రయత్నాలు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని సీనియర్ నేతలను తమవైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థులను బలహీనపరచడంతో పాటు స్థానిక స్థాయిలో పార్టీ బలాన్ని పెంచుకోవాలని పార్టీ ప్రయత్నించవచ్చని అంచనా వేస్తున్నారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలో ఉందని, లోటు బడ్జెట్, రుణభారం, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలతో సంప్రదింపులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్య క్రమా లు, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని ముం దుకు తెస్తూ ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నది. కాంగ్రెస్ పరిపాలనా దుర్వినియోగం అనే అంశాన్ని బలపర్చేందుకు బీజేపీకి అవకాశంగా మారుతున్నాయ ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ తో పాటు అగ్రనేతలు తెలంగాణ పర్యటనలు షురూ చేస్తారని అంచనా వేస్తున్నారు.