15 June, 2026 | 3:39 AM

విడాకులు వద్దు.. కాపురం ముద్దు

15-06-2026 02:26 AM

కోర్టు గదిలోనే హత్తుకున్న భార్యా భర్తలు

ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో ముచ్చటైన ఘటన 

న్యూఢిల్లీ, జూన్ 14 (విజయక్రాంతి): విడాకుల కోసం ప్రయత్నించిన ఓ జంట మళ్లీ కలిసింది. భార్యా, భర్త ఒకరినొకరు కోర్టు గదిలో వాదనలు కొనసాగుతుండగా హత్తుకొని తమ ప్రేమను చాటుకొని కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన సౌరభ్‌కు 2020లో శిఖ అనే యువతితో వివాహం జరిగింది. కొద్దికాలం సజావుగా సాగిన వీరి కాపురం చిన్నచిన్నపాటి విభేదాలతో తెగదెంపుల వరకు దారితీసింది. ఇరువురు ఐదేళ్లుగా విడాకుల కోసం ఫ్యామిటీ కోర్టులో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు ఖర్చులు, న్యాయవాదుల ఫీజుల కాస్త తడిసి మోపెడై ఇరుకుటుంబాలను ఆర్థిక అగాధంలో నెట్టాయి. శిఖ తండ్రికి గుండెపోటు వచ్చింది. మంచి ఆసుపత్రిలో చూపిద్దామంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. చేసేదేం లేక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించింది.

విషయం తెలుసుకున్న శిఖ భర్త సౌరభ్ వెంటనే విభేదాలను పక్కన పెట్టి తన మామగారిని మెరుగైన వైద్యం కోసం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. అందుకైన ఖర్చునంతా అతడే భరించాడు. దీంతో శిఖ తండ్రి తిరిగి కోలుకున్నాడు. ఈ లోపు మరోమారు కోర్టులో విడాకుల కేసు విచారణకు వచ్చింది. దంపతులిద్దరూ హాజరయ్యారు. న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. న్యాయమూర్తి ఇరువురిని ఉద్దేశించి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారా? అని అడిగాడు.

వెంటనే శిఖ తన వద్ద ఉన్న విడాకుల పత్రాలను చించివేసి తన భర్తను హత్తుకొని భోరున విలపించింది. ఈ దృశ్యాన్ని కాస్త అక్కడ ఉన్న వారు సెల్‌ఫోన్‌లో చిత్రించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. అనంతరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని కోర్టుకు తెలపడంతో కోర్టు కూడా వారి విడాకుల కేసు కొట్టివేస్తూ తథాస్తు అని దీవించింది. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే చిన్నచిన్న మనస్పర్థలను పక్కనపెట్టి సర్దుకుపోతేనే కాపురం అనేది కలకలం నిలుస్తుందనడానికి ఈ ఘటన ఉదాహరణగా భావించవచ్చు.