calender_icon.png 4 February, 2026 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ బడ్జెట్

03-02-2026 12:00:00 AM

ప్రపంచంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న భారత్ నేడు సుస్థిర ఆర్థిక వద్ధితో దూసుకుపోతున్నది. ఆ ఊపు అలాగే కొనసాగించేందుకు ఒక శక్తిగా 2026-27 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మూడు కర్తవ్యాలు.. ఆరు సంస్కరణలతో వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారు.

ఎన్నడూ లేనంతగా ఈసారి రక్షణ రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించడం గొప్ప విషయం. అయితే యువత, మహిళలు, రైతుల సాధికారత, టెక్నాలజీ, మౌలిక వసతుల అభివద్ధి, రైల్వే, వ్యవసాయం,ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆదాయ పన్నుల్లో ఎటువంటి మార్పులు లేకపోవడం వేతన జీవికి నిరాశ కలిగించింది.భారతావని ప్రగతి రథాన్ని స్థిరంగా నడిపించడంపైనే దష్టి కేంద్రీకరించారు.

ఆర్థికాభివద్ధిని వేగవంతం చేసే వ్యవస్థాపగత సంస్కరణల కొనసాగింపుకే అధిక ప్రాధాన్యమిచ్చారు. గతంతో పోలిస్తే అతి సాధారణ బడ్జెట్‌గా కనిపిస్తున్నప్పటికీ ఈసారి బడ్జెట్‌లో మెరుపులు లేకపోలేదు. రక్షణ రంగాన్ని మరింత పటిష్టపరచాలనే ఉద్దేశంతో బడ్జెట్‌లో అత్యధిక నిధులు ఈ రంగానికే కేటాయించాలనుకోవడం స్వాగతించాల్సిన అంశం. గతేడాది పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ చర్య మన దేశ ఆయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాం.

ఆ ఆపరేషన్‌లో వినియోగించిన అత్యాధునిక ఆయుధాలకు మరింత శక్తినిస్తూ కేవలం సాయుధ దళాల ఆధునీకరణకు 2.19 లక్షల కోట్లు కేటాయించడం ముదావహం. ఇక వ్యవసాయరంగంలో రైతన్నలకు పెద్దగా ఆశించే ప్రయోజనాలు లేకపోయినప్పటికీ 500 చెరువులను ఏర్పాటు చేసి మత్స్య సంపదను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఇక గ్రామీణాభివద్ధికి ఎప్పటిలాగే పెద్దపీట వేసినప్పటికీ ఈసారి చెప్పుకోవాల్సిన అంశం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ యోజన ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ).

గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీకి దాదాపు 95 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించడం హర్షించదగ్గ అంశం. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారాల వంట అరుదైన ఖనిజాల కోసం విదేశాల మీద ఆధారపడటం దేశానికి ఎన్నటికీ మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశాలలో రేర్‌ఎర్త్ కారిడార్ల ఏర్పాటుకు మద్దతునిస్తామన్న బడ్జెట్ ప్రతిపాదన సాకారమైతే స్థానికంగా అతి విలువైన ఖనిజాల తవ్వకాలు, అనుబంధ కార్యకలాపాల వద్ధిని జోరెత్తించగలదు.

ఇక ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పులులు కలిగిన దేశంగా ఉన్న భారత్ లో వాటి సంరక్షణ గురించి ఈ ఏడాది తొలిసారి గ్లోబల్ బిగ్ క్యాట్ సదస్సును నిర్వహించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాదు దేశం నలుమూలలా ఉన్న పర్వతాల శ్రేణుల అభివద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొనడం అభినందించాల్సిన అంశం.

ఇక బడ్జెట్ లో తెలంగాణకు పెద్దగా ప్రాధాన్యం దక్కనప్పటికీ పర్యావరణ హితకర పద్ధతుల్లో ప్రజారవాణా సదుపాయాలను విస్తతం చేయాలన్న కేంద్రం తలంపు శ్రేయోదాయకమైనది. ఇందులో భాగంగా అభివద్ధి చేయనున్న ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలోని మూడింటిలో హైదరాబాద్ కు చోటు దక్కడం హర్షణీయం.