01-02-2026 12:00:00 AM
డాక్టర్ తిరుణహరి శేషు :
బడ్జెట్ అంటే అంకెల సమాహారం కాదు.. దేశ ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ. ఒకప్పుడు 375 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన గణతంత్ర భారత బడ్జెట్ 50 లక్షల కోట్ల రూ పాయలకు పెరిగినా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోవటం వల్ల బడ్జెట్‌లపై ప్రజలకి నమ్మకం సన్నగిల్లుతుంది. అంతర్జాతీ యంగా ఎదురవుతున్న సవాళ్లు ముఖ్యం గా అమెరికాతో వాణిజ్య చర్చల్లో ఏర్పడిన ప్రతిష్ఠంభన, ట్రంప్ సుంకాల పెంపు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం, యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
కొంతకాలంగా రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదిస్తు న్న భారత విత్త మంత్రి నిర్మల సీతారామన్ 2026 -27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెడుతున్న వార్షిక బడ్జెట్‌లో ఏ రం గాలకి, ఏ వర్గాలకి ఎంత ప్రాధాన్యత దక్కుతుంది, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపా యి విలువ పతనం లాంటి సమస్యలను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు చేపడతారనే అంశంపై ఆసక్తి నెలకొన్నది.
మధ్యతరగతి మందహాసమేనా!
వికసిత్ భారత్ లక్ష్యంగా మధ్యతరగతిని సంతుష్టీకరించటానికి గత బడ్జెట్‌లో అనేక వారాలు ప్రకటించిన ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌లో కూడా మధ్యతరగతిపై మరిన్ని వరాలు కురిపించే అవకాశం లేకపోలేదు. దేశంలో 40 శాతం ఉన్న మధ్యతరగతి వర్గాన్ని గ్రోత్ ఇంజిన్‌గా ఉపయోగించుకోవటం ద్వారా జీరో పేదరికం లక్ష్యాన్ని చేరు కోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మరొకసారి బడ్జెట్ లో మధ్యతరగతి వర్గాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
గత బడ్జె ట్‌లో మధ్యతరగతి కొనుగోలు శక్తిని పెం చటానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే ఈ బడ్జెట్‌లో కూడా మధ్యతరగతి కొనుగోలు శక్తిని పెంచటానికి మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యతరగతికి వెసులుబాటు కల్పించడానికి జీఎస్టీ స్లాబ్‌లను నాలుగు నుంచి రెండింటికి కుదించా రు.
అలాగే పన్నుల సంస్కరణల్లో భాగం గా ప్రస్తుతం ఉన్న ఐదుస్లాబ్‌లను రెండు లేదా మూడు స్లాబ్‌లకు పరిమితం చేసి, పన్ను మినహాయింపుని 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయలకు పెం చబోతున్నారనే వార్తలు వినపడుతున్నా యి. పన్ను సంస్కరణల వల్ల మధ్యతరగతి చేతిలో ఎక్కువ డబ్బులు ఉంచడం ద్వారా పొదుపు, వినియోగాన్ని పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తుంది.
ప్రాధాన్యత దక్కేనా!
బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్యా, ఆరోగ్యం, ఎంఎస్‌ఎంఈ, ర క్షణ రంగం లాంటి కీలక రంగాలపై మరిం త దృష్టి పెట్టి నిధులు కేటాయించడమే కా దు ఆయా రంగాలను బలోపేతం చేయటానికి చర్యలు చేపట్టాలి. దేశంలో ఎక్కువ శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగానికి సం బంధించి గత బడ్జెట్‌లో ఆరు కొత్త పథకాలను ప్రకటించారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణ పరిమితిని మూడు లక్షల రూపాయలు నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు.
కానీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా సంవత్సరానికి దరిదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకు అందించే పెట్టుబడి సహాయాన్ని 6వేల నుంచి 10వేలకు పెంచాలని రైతులు ఆశిస్తున్నారు. ఇటీవల భారతదేశం వరి పండించే దేశాల్లో చైనాను అధిగమించి మొదటి దేశంగా రికార్డులకు ఎక్కింది.
కానీ పంటల మార్పిడిలో భాగంగా దేశంలో తృణధాన్యాలు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచటానికి బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా రైతుల ఆదాయా న్ని పెంచాలి. వ్యవసాయానికి సాంకేతిక సొబగులు అద్దాలనే ఆలోచన మంచిదే కానీ వ్యవసాయ రుణ పరిమితి విషయంలో కనీస మద్దతు ధరల విషయంలో మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.
గ్రామీణంపై దృష్టి!
మరొక కీలక రంగం గ్రామీణాభివృద్ధిపై కూడా బడ్జెట్‌లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవటానికి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామీణ ప్రజల ఆదాయాలను పెం చడానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్ర ధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలను సమర్థవంతం గా అమలు చేయడంతో పాటు ‘లక్ పత్ దీదీ’ ద్వారా మహిళల ఆదాయాలను పెం చే కార్యక్రమాలను చేపట్టాలి.
మానవ జీవ న నాణ్యతను పెంచే విద్య ఆరోగ్య రంగాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. గత బడ్జెట్‌లో విద్యపైన 2.5 శాతం, ఆరోగ్యం పైన 2 శాతం నిధు లు మాత్రమే కేటాయించడం వలన ఆయా రంగాల్లో ఆశించిన ఫలితాలు సా ధించలేకపోతున్నామనే అసంతృప్తి వ్యక్తం అవు తుంది.
అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్ద ఎత్తున నిధులు పెంచబోతున్నారనే ఊహాగానాలతో పా టు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా ఎగుమతులను పెంచటానికి అనువైన వాతా వరణాన్ని కల్పించడం ఎగుమతిదారులకు మరిన్ని ప్రోత్సాహకాలను ప్రకటిం చే అవకాశాలు కనపడుతున్నాయి.
భద్రత కల్పిస్తేనే..
ధరల పెరుగుదల నిరుద్యోగం, పేదరికం, రూపాయి విలువ పతనం లాంటి సమస్యలపై బడ్జెట్‌లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. నైపుణ్యాల పెంపు, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలను కొనసాగిం చడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించటం, వికసిత్ భారత్ జీ రామ్ జీ ద్వారా పని దినాలను 125 రోజులకు పెంచటం, పీఎం స్వనిధి ద్వారా వీధి వ్యాపారులకు పెట్టుబడి సహాయం, కోటి 20 లక్షల మంది గిగ్ వర్కర్లకి భద్రత, మహిళా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం ద్వారా కొంతమేరకు నిరుద్యోగ తీవ్రతను తగ్గించే చర్యలు చేపట్టాలి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కొనసాగింపుతో పేదవాళ్లకు భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ పరిస్థితి!
గత కొంతకాలంగా బడ్జెట్‌లో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో పెద్దపీట వేస్తున్నారనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. గత బడ్జెట్‌లో బీహార్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే ఈ బడ్జెట్‌లో త్వరలో దేశంలో జరగబో యే ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలకు వరాలు ప్రకటిస్తారనే అభిప్రాయం తేటతెల్లమవుతుంది. కానీ తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ర్టం పై బడ్జెట్‌లో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి.
గత సంవత్సరం బడ్జెట్ కి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.65 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపిస్తే ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా అదనంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు. మెట్రో రెండోదశ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణానికి, డ్రైపో ర్ట్ ఏర్పాటు ప్రతిపాదనకి అనుమతులు ఇవ్వకపోవడం, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయింపు విషయాన్ని పట్టించుకోలేదు.
విమానాశ్రయాల కేటాయింపు, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, ఐఐ ఎం లాంటి జాతీయ విద్యా సంస్థలను కేటాయించకపోవడం, విభజన చట్టంలో పొందుపరచిన హామీలను నెరవేర్చకపోవటం తెలంగాణకు జరుగుతున్న అన్యా యంగా భావించాలి. బడ్జెట్‌లలో ప్రభుత్వాలు అంకెల గారడి చేస్తూ కేటాయింపు లు ఘనంగా చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేయకపోవడం వల్ల వాస్తవ ఫలితాలు రావడం లేదనే విమర్శ తరచూ వినిపిస్తుంది. కాబట్టి బడ్జెట్ అంటే అంకెల గారడి కాదు అది ప్రజల సంక్షేమానికి, దేశాభివృద్ధికి రూపొందించే ఒక బాధ్యతాయుతమైన పద్దుగా భావించాలి
వ్యాసకర్త సెల్: 9885465877