అద్దెకు ఖాళీ ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్‌లు
- వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాం
- సంస్థ ప్రగతిలో భాగస్వాములు కావాలి
- ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి) : ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయాణ అనుభూతులతో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ సరికొత్త వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, తమ సంస్థలను విస్తరించుకోవాలనుకునే వారికి ఇది ఒక బంపర్ ఆఫర్‌గా నిలవనుంది.
సాధారణంగా ఏ వ్యాపారానికైనా ‘కస్టమర్ల రాక’ అనేది అత్యంత కీలకం. ఆర్టీసీ బస్టాండ్లు, కాంప్లెక్స్లు నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల, ప్రచార ఖర్చులు లేకుండానే వ్యాపారస్తులకు కస్టమర్లు లభిస్తారు. హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్ల నుంచి చిన్న తరహా దుకాణాల వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ లు అనువైన వేదికలుగా మారనున్నాయి.
సంస్థను లాభాల బాట పట్టించడంతో పాటు, స్థానిక నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉన్నతాశయంతో టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, డిపోల పరిధిలో ఉన్న ఈ ఖాళీ వ్యాపార సముదాయాల వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్ tgsrtc.telangana.gov.in లో పొందుపరచడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 694 షాపులకు త్వరలో టెండర్లు పిలువనున్నది.
టీజీఎస్‌ఆర్టీసీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం అటు రవాణా సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తూ, ఇటు వ్యాపార రంగానికి సరికొత్త ఊతాన్ని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్టీసీ స్థలాల్లో షాప్స్ నిర్వహణ ప్రక్రియను మరింత సరళతరం చేశామని, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. టీజీఎస్ ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదావకాశం వ్యాపారులకు ఎంతో లాభదాయకమని, దీనిని సద్వినియోగం చేసుకుని వ్యాపార వృద్ధిని సాధించడమే కాకుండా సంస్థ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఎండీ వై.నాగిరెడ్డి కోరారు.






