20 March, 2026 | 5:33 AM

ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం

20-03-2026 12:33 AM
  1. మన భారతీయ సంస్కృతి గొప్పదనానికి ప్రతీక

పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉగాది వేడుకలు, పచ్చడి పంపిణీ

ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, మార్చి 19 (విజయక్రాంతి): ఉగాది పచ్చడి అంటే కేవలం షడ్రుచుల సమ్మేళనం మాత్రమే కాదని భారతీయ సంస్కృతి గొప్పదనానికి ప్రతిక అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతోపాటు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే కాస్త సుఖాలను వివిధ అనుభవాలను సమానంగా స్వీకరించాలన్నారు. ఉగాది పచ్చడి మనకు కష్టసుఖాలను గుర్తు చేస్తుందని వివరించారు.

మన గొప్ప సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఈ నూతన సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, వారి కుటుంబ సభ్యులకు, పోలీస్ కుటుంబాలకు ఎస్పి రాజేష్ చంద్ర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సర కాలంలో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు.

కామారెడ్డి పోలీసులు ఎప్పుడు ప్రజలతోనే ఉంటారని పేర్కొన్నారు. ప్రజల సంతోషాలను పంచుకోవడమే కాకుండా కష్ట కాలంలో కూడా వారికి వెన్నుముకగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నూతన సంవత్సరలో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఎలాంటి సమస్యలు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి, కామారెడ్డి రూరల్ సిఐ రామన్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు యువకులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం పూర్తయిన అనంతరం  ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.

తాడ్వాయి మండలంలో..

తాడ్వాయి, మార్చి, 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో పండుగ వేడుకలు అంబరాన్ని అంటాయి. తొలి తెలుగు నూతన సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. గ్రామాలలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సంవత్సరం అంతా గ్రామాలలో మంచి జరగాలని, పంటలు బాగా పండాలని దేవాలయాలలో పూజలు చేశారు. తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆలయంలో, సంతాయిపేట గ్రామ శివారులోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో, చిట్యాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో, కృష్ణాజివాడి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో, నందివాడ బసవన్న దేవాలయంలో, ఎర్రపహాడ్ లోని ఎల్లమ్మ దేవి ఆలయంలో, దేమి కలాన్ లోని పార్వతి దేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం ఎడ్లబండ ప్రదర్శన నిర్వహించారు. గ్రామదేవతల చుట్టూ ఎడ్లబండ్లను తిప్పుతూ పాటలు పాడారు. ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండ్లను గ్రామ దేవతల చుట్టూ తిప్పుతూ మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు పాల్గొని సంబురాలు  జరుపుకున్నారు.