మూడు నెలల్లో యూసీఎఫ్ పనులు షురూ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడి
ముకరంపురా, జూలై 15 (విజయ క్రాంతి): రాబోయే మూడు నెలల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద కేంద్రం మంజూరు చేసిన 840 కోట్ల నిధులతో కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దే పనులను ప్రారంభిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి 47వ డివిజన్ లోని రాంనగర్ సిద్దార్థ స్కూల్ సమీపంలో 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 62వ డివిజన్ శ్రీరామ బుక్ స్టాల్ లేన్ నుండి మోర్ సూపర్ మార్కెట్ వరకు 98 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయా నిధులతో కరీంనగర్ లో మోడల్ రోడ్లను నిర్మించడంతోపాటు స్కై వాక్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ శివారు ప్రాంతాల్లోని గల్లీగల్లీలో సీసీ రోడ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(యూఐడీఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ కు మంజూరు చేసిన 50 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో అభివ్రుద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు.
ఇప్పటికే స్మార్ట్ సిటీ కింద 900 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దామని, అమ్రుత్ 1, 2 కింద 279 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. అలాగే అర్బన్ డెవలెప్ మెంట్ ఫండ్ కింద 50 కోట్లు వచ్చాయని, వాటితో గల్లీల్లో రోడ్లు, ఇతర అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టినమని తెలిపారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం కోసం కేంద్రమే పూర్తిగా 156 కోట్లను మంజూరు చేసిందని, శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు.
అభివ్రుద్ధిలో తెలంగాణలోనే కరీంనగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడంతోపాటు సుందర నగరంగా మార్చబోతున్నామన్నారు. యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ లో పార్కింగ్ సమస్య లేకుండా 25 కోట్లతో శాశ్వత పరిష్కార పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో కరీంనగర్ ను అభివ్రుద్ధి చేస్తున్నామని, కరీంనగర్ పార్లమెంట్ ను అభివ్రుద్ధిలో అగ్రగామిగా, ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నానని తెలిపారు.






