16 July, 2026 | 12:51 AM

నెత్తురోడిన పీవోకే

16-07-2026 12:42 AM
  1. ముజఫరాబాద్ లాంగ్‌మార్చ్‌పై  పాక్ సైన్యం కాల్పులు
  2.   12 మంది మృతి.. వందల మంది క్షతగాత్రులు
  3. రిజర్వు అసెంబ్లీ స్థానాల కేటాయింపు విషయంలో పీవోకే వాసుల అభ్యంతరాలు 
  4. కశ్మీరీ శరణార్థులకు కేటాయించడంపై కన్నెర్ర
  5. శాంతియుతంగా నిరసన చేపట్టగా హింసాత్మక ఘటనలు

ఇస్లామాబాద్, జూలై 15 (విజయక్రాంతి): పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ముజఫరాబాద్‌లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పిలుపు మేరకు స్థానికులు చేపట్టిన లాంగ్‌మార్చ్‌లో రక్తపాతం చోటుచేసుకున్నది. పీవోకే పరిధిలోని 12 రిజర్వు అసెంబ్లీ స్థానాలను ఇతర ప్రాంతాల్లో నివసించే కశ్మీరీ శరణార్థులకు కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం ఆందోళనకారులు చేపట్టిన ప్రదర్శనపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 27న జరగనున్న పీఓకే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.

దీంతో పాటు పలు డిమాండ్లపై జేఏఏసీ 38 డిమాండ్లతో చార్టర్ రూపొందించింది. ఇందులో స్థానిక ప్రజలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం, ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విధానాలపై అభ్యంతరాలు, పాలకుల సౌకర్యాలను రద్దు చేయటం, పరిపాలనా నిర్ణయాల వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వీటిపై కొంతకాలంగా స్థానికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలోనూ లాంగ్‌మార్చ్‌లు, ఆందోళనలు జరిగాయి. మంగళవారం జరిగిన ఘర్షణల్లో12 మంది మృతి చెందగా, వందల మందికి గాయాలయ్యాయి.

ఫజ్లూర్ రెహ్మాన్‌పై దేశద్రోహం కేసు

మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్‌పై పాకిస్తాన్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. పాక్ సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కసూర్ నగరంలోని సదర్ పోలీస్ స్టేషన్‌లో రెహ్మాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈనెల 13న జరిగిన ఒక ర్యాలీలో పాక్ సైన్యం, అమరవీరులను ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఒక స్థానికుడు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు సెక్షన్ 124- ఏ కింద దేశద్రోహం కేసు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, సైన్యంలో భయాందోళనలు సృష్టించడం వంటి ఇతర సెక్షన్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

పీఓకేలో శాంతి నెలకొనాలి :  మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ 

పీఓకేలో శాంతి నెలకొనాలని జేఐ-ఎఫ్ అధినేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, నిరసనకారుల మధ్య చర్చలు కొనసాగుతున్నందున రావాలాకోట్‌లో నెల రోజులుగా సాగుతున్న ఆందోళనలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆందోళనలను మరింత ఉధృతం చేయవద్దని కశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య పాకిస్తాన్ పార్లమెంటుకు చేరిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, నిరసనకారులకు మధ్య చర్చలు జరపడానికి అవామీ యాక్షన్ కమిటీ తనను మధ్యవర్తిగా కోరినట్లు ఆయన వెల్లడించారు.  

భారీగా వచ్చిన జనం..

షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి జేఏఏసీ విధించిన గడువు ముగియడంతో రావాలాకోట్ నుంచి పీఓకే రాజధాని ముజఫరాబాద్‌కు లాంగ్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ నిరసన ప్రదర్శనలో దాదాపు 40,000 మంది పాల్గొనాలని జేఏఏసీ నిర్ణయించింది. నిరసనకారులు ముజఫరాబాద్‌కు చేరకుండా అడ్డుకుంటామని భద్రతా బలగాలు ముందుగానే హెచ్చరించాయి. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రావాలాకోట్ నుంచి వేలాది మంది ప్రజలు ముజఫరాబాద్ వైపు భారీ ర్యాలీగా కదిలారు.

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో సుధ్నోతి, తరార్‌ఖల్, అర్జా ప్రాంతాల్లో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు కాల్పులకు దిగినట్లు స్థానిక నివేదికలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనల నేపథ్యంలో రావాలాకోట్‌లో మీడియాపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆందోళనకారులపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.