జైతలా మున్సిపల్‌లో అవినీతి కంపు?
- ఏకంగా కమిషనర్ సంతకాలు ఫోర్జరీ
- అసిస్టెంట్ ఇంజనీర్ పేరుపై రిపేర్ చెక్కులు
- ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన మోసాలు
కోరుట్ల /జగిత్యాల జులై 15 ( విజయ క్రాంతి )జగిత్యాల మున్సిపాలిటీ అవినీతి కూపంలో కూరుకు పోయింది. తాజాగా వెలుగు చూసిన సంఘటన పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. మున్సిపల్ అసెస్మెంట్ కాపీలపై కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అనుమానాస్పద లావాదేవీలు:
ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించి సర్వీస్ సంస్థల పేరు కాకుండా, అసిస్టెంట్ ఇంజనీర్ పేరు మీద రిపేర్ చెక్కులు జారీ చేయడం, అధికారుల ఫోన్ల ద్వారా అనుమానాస్పద డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది . గతంలో భారీ అవినీతి, అక్రమాలు జరిగినట్లుగా అవినీతి నిరోధక శాఖ ( ఏ సి బి) విజిలెన్స్ దాడుల్లో వెల్లడైంది. నిధుల దుర్వినియోగం, పన్నుల వసూళ్లలో లోపాలు, రికార్డుల ట్యాంపరింగ్, ఇండ్ల పర్మిషన్, కొత్త వెంచర్ లు వంటి అనేక అవకతవకలు బయటపడ్డాయి.
ఏసీబీ దాడులలో (రూ. 8.23 కోట్ల పన్నుల లోటు): అవినీతి నిరోధక శాఖ (ఏ సి బి )జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భారీ ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. రూ. 17.19 కోట్ల పన్నుల వసూలు లక్ష్యానికి గాను కేవలం రూ. 8.95 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇందులో రూ. 8.23 కోట్ల షార్ట్ఫాల్ (లోటు) ఉన్నట్లు తేలింది.
మున్సిపాలిటీకి చెందిన 4 ఆటోలు (2022 నుండి), 1 ట్రాక్టర్ (2020 నుండి) కనబడకుండా పోయాయి. ఇప్పటివరకు వీటిపై ఎలాంటి పోలీసు ఫిర్యాదు చేయకుండా కనీసం అధికారులకు కూడా పిర్యాదు చేయలేదు.మున్సిపాలిటీ లో 194 షాపులకు 18 ఏళ్లుగా టెండర్లు పిలవకుండా పాత ధరలకే అద్దెలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే ప్రకటనల పన్ను ( అడ్వటజరైజింగ్ టాక్స్ ) వసూలులో కూడా తీవ్ర నిర్లక్ష్యం జరిగింది.ఇలా వరుస సంఘటనలు జగిత్యాల .మున్సిపాలిటీ లో పరువును మంట గలిపింది.






