16 July, 2026 | 12:48 AM

బోనాల జాతర షురూ

16-07-2026 12:30 AM
  1. నేడు గోల్కొండ జగదాంబిక చెంత తొలి పూజ
  2. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు సురేఖ, పొన్నం, స్పీకర్ ప్రసాద్ 

రంగారెడ్డి, జూలై 15 (విజయక్రాంతి): ఆషాఢ బోనాల జాతర గోల్కొండ కోట గోడల మధ్య నేడు అత్యంత కోలాహలంగా మొదలవుతుంది. తొలి బోనాన్ని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు 3,500 దేవాలయాలలో ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

నేడు ఆషాఢ మాసపు తొలి గురువారం కావడంతో లంగర్ హౌజ్ కమాన్ నుంచి గోల్కొండ కోట వరకు పట్టువస్త్రాల ఊరేగింపు (తోటం) ఇరుమతాల భక్తుల నడుమ అత్యంత శాంతియుతంగా, ఉల్లాసభరితంగా సాగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారికంగా అమ్మవారికి పట్టువస్త్రాలను, బంగారు బోనాన్ని సమర్పింస్తారు.

జాతర ప్రత్యేకతలు.. ప్రధాన ఆకర్షణలు

సాధారణంగా బోనాలు రెండు లేదా మూడు రోజులు జరిగితే, గోల్కొండ కోటలో మాత్రం దేవీ నవరాత్రుల తరహాలో తొమ్మిది వారాల పాటు ఈ ఉత్సవాలు విశిష్టంగా సాగుతాయి. కోటపై వెలసిన జగదాంబిక దేవి శాంతస్వరూపిణి అయినప్పటికీ, శత్రుసంహారక శక్తిగా ‘సింహవాహిని’ రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. 

ఉత్సవాల పూర్తి షెడ్యూల్ 

జూలై 16న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. జూలై 19 గోల్కొండ కోటలో సామూహిక బోనాల సమర్పణ. జూలై 19న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం. జూలై 20న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం. జూలై 21న అత్యంత వైభవంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. జూలై 22న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం.

ఆగష్టు 2 (ఆదివారం)న సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. ఆగష్టు 3న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో భవిష్యవాణి వినిపించే ‘రంగం‘ కార్యక్రమం, ఘటాల ఊరేగింపు. ఆగష్టు 9న హైదరాబాద్ పాతబస్తీ (లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు ఇతర ఆలయాల) బోనాల పండుగ. ఆగస్టు 10న పాతబస్తీ ఆలయాల్లో ‘రంగం‘ (భవిష్యవాణి), ఉమ్మడి ఘటాల ఊరేగింపు మహోత్సవం. ఆగష్టు 13న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే 9వ పూజ (ముగింపు ఉత్సవం).