16 July, 2026 | 1:15 AM

ఇందిరమ్మా.. బిల్లేదమ్మా..!

16-07-2026 01:04 AM
  1. ఇందిరమ్మ’ బిల్లుల కోసం నిరీక్షణ
  2. మెదక్ జిల్లాలో 8953 ఇండ్లు మంజూరు..
  3. ఇప్పటి వరకూ 6123 ఇళ్లు పూర్తి..
  4. మొత్తం రావాల్సింది రూ.447.65 కోట్లు...వచ్చింది రూ 154.98 కోట్లు..
  5. గృహ ప్రవేశాలు చేసినా అందని చివరి బిల్లులు..
  6. ఆశగా ఎదురుచూస్తున్నా ఇందిరమ్మ లబ్ధిదారులు...
  7. ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధి హామీ కట్..

మెదక్, జులై 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించుకుని గృహ నిర్మాణాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి చివరి విడతగా లక్షా 20 వేల నుంచి లక్షా 60 వేల రూపాయల వరకు బిల్లులు విడుదల కావాల్సి ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద ఇవ్వాల్సిన 3 లక్షల 40 వేల రూపాయల బిల్లులను ఇళ్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన బిల్లుల గురించే లబ్ధిదారులు కలవరానికి గురవుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 2025లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది.

మొదటి విడతలో సొంతంగా స్థలం ఉన్న వారిని గుర్తించి ఇళ్లు మంజూరు చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రభుత్వం 3 వేల చొప్పున ఇళ్లను కేటాయించింది. అందులో భాగంగా మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 8025 ఇండ్లు కేటాయించగా, నాలుగు మున్సిపాలిటీలు అయిన మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో మొదటి విడతలో 928 ఇళ్లను కేటాయించారు. జిల్లాలో మొత్తం 8953 మంజూరు చేశారు.

నాలుగు మున్సిపాలిటీలు అయిన మెదక్ మున్సిపాలిటీలో 350, తూప్రాన్ మున్సిపల్ లో 107, నర్సాపూర్ మున్సిపల్ లో 375, రామాయంపేట మున్సిపల్ లో 96 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 8953 ఇండ్లను మంజూరు చేయగా, బేస్మెంట్ స్థాయిలో 1379, గోడల స్థాయిలో 634, స్లాబ్ లు పూర్తి అయినవి 2363, గృహ ప్రవేశాలు చేసినవి 1747 మొత్తం 6123 ఇండ్లు పూర్తి అయ్యాయని ఇప్పటి వరకూ రూ.154.98 కోట్ల బిల్లులు చెల్లించారు. అయితే ఇందులో గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు చివరి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధి హామీ అనుసంధానం.. 

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేశారు. దీంతో 90 రోజుల పని దినాలను లబ్ధిదారులకు కల్పిస్తూ.. రూ.27 వేలు బిల్లు చెల్లించారు. ఇప్పుడు ఈ జీ ఎస్ పేరును విబిజీరామ్ జీ అమలులోకి రావడంతో90 రోజుల పని దినాల బిల్లులు రావడం లేదు. మరో వైపు విబిజీరామ్ జీ పథకంలో 318 పనులను కేంద్ర ప్రభుత్వం సూచించింది. కానీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కేంద్రం జాబితాలో లేదు.

దీంతో రూ.27వేల బిల్లు చెల్లింపులు నిలిచిపోయాయి. మరో వైపు స్వచ్ఛ భారత్ మిషన్ లో మరుగుదొడ్డి రూ.12 వేలు, ఇంకుడు గుంతకు రూ.6వేలు ఇస్తున్నారు. 90 రోజుల పని దినాలకు విబిజీరామ్ జీ పథకంలో రామ్ రామ్ పలికారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో ఇబ్బందిగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మించుకున్న లబ్ధిదారులు చివరి బిల్లుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో 6123 ఇళ్లు పూర్తి.. 

జిల్లాలో ఇప్పటి వరకు 6123 ఇళ్ల నిర్మాణాలు పూర్త య్యాయి. రేగోడ్ మండలంలో 299, మెదక్ మండలంలో 297, హవేలీ ఘనాపూర్ లో 314, నార్సింగి 212, చేగుంట 483, పాపన్న పెట్ లో 524, తూప్రాన్ 163, చిన్న శంకరం పేట 387, వెల్దుర్తి 286, పెద్ద శంకరం పేట 250, టెక్మాల్ 180, మాసాయిపెట్ 135, మనోహర్ బాద్ 86, నిజాంపేట్ 203, రామాయంపేట 309, శివ్వంపేట 312, చిలిపిచెడు 162, కౌడిపల్లి 239, నర్సాపూర్ 220, అల్లాదుర్గం 220, కొల్చారం 210 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.

ఇందులో ఒక్కో లబ్ధి దారుడికి లక్షా 20 వేల నుంచి లక్షా 60 వేల రూపాయల వరకు వరకు బిల్లులు రావాల్సి ఉన్నాయి. చాలా మంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఇళ్ల నిర్మాణాల కోసం అప్పులు తీసుక వచ్చామని, బిల్లులు రాకపోవడంతో వడ్డీల భారం పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి తమ వాటా నిధులను విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

బిల్లులు రాగానే అందజేస్తాం

మొదటి విడతలో పూర్తి అయిన ఇండ్లకు గృహ ప్రవేశాలు చేయడం జరి గింది. పూర్తి అయిన ఇండ్లకు చివరి బిల్లులకు సంబంధించి ఆన్ లైన్ లో నమోదు చేయడం జరిగింది. జిల్లాలో 6123 ఇండ్లు పూర్తి కాగా, రూ.15498 కోట్లు చెల్లింపులు చేశాం.

మాణిక్యం, హౌసింగ్ పీడీ