ప్రభుత్వ బడుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు
- గత నాయకులు చదువు గురించి పట్టించుకోలేదు
- వ్యసనాల తెలంగాణగా మార్చారు
- ఆగస్టు 15 నాటికి 9 వస్తువులతో ఎడ్యుకేషన్ కిట్లు
- సీఎం రేవంత్‌రెడ్డి
- వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభం
- హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి
వనపర్తి, జూలై 15 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తారని, రాష్ట్ర భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో రూ.1.77 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని బుధవారం మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, శంకర్, స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ శివ సేనారెడ్డి, ఫిష్ అండ్ గోట్ చైర్మన్ సరితతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఏం వస్తుంది అని మీ బంధువులు, స్నేహితులు అంటే నన్ను చూపించండి’ అని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల గదుల్లో చదువుతున్న విద్యార్థుల చేతిలో ఉంటుందని చెప్పారు. గత నాయకులు ప్రభుత్వ బడులను, చదువును పట్టించుకోలేదని విమర్శించారు.
ఇంటి పేర్లు నీళ్లు అని పెట్టుకున్నారే తప్పా కొత్తకోటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన రాలేదన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఎమ్మెల్యే కాకముందే విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారని, సైకిళ్ళు, షూస్ పంపిణీ చేశారని చెప్పారు. విద్యార్థులకు శాశ్వత భవనం నిర్మించి, ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
జిల్లాను పరిపాలన రంగంలో ముందుకు తీసుకెళ్ళుతున్న కలెక్టర్లను బదిలీ చేయడం సులభం కానీ ఒక్క టీచర్‌ను బదిలీ చేయడం అంత సులువు కాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని, కానీ రాష్ట్రవ్యాప్తంగా 13 వేల ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు వచ్చేలా ఉపాధ్యాయులు పని చేయాలని సీఎం సూచించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ 33 వ స్థానంలో ఉన్న తెలంగాణను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 18వ స్థానంలోకి వచ్చిందని చెప్పారు.
గత ప్రభుత్వంలో వ్యసనాల తెలంగాణ
గత ప్రభుత్వంలో పేదలకు అందాల్సిన విద్య పట్ల నిర్లక్ష్యం చేయడంతోనే వ్యసనాల బారిన పడి వ్యసనాల తెలంగాణగా మారిందని అలాంటి వ్యసనాల తెలంగాణను విద్యావంతుల తెలంగాణగా మార్చేందుకుగాను విద్యావ్యవస్థను తన దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటిగా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని సీఎం వివరించారు. పగుళ్లు రాళ్లు పట్టిన చేతులతోనే పెన్నుపట్టాలని తెలంగాణ రాతలు మార్చాలని విద్యార్థులకు సీఎం సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక్క విద్యార్థి పైన ప్రభుత్వం సంవత్సరానికి 1లక్ష 8 వేల రూపాయలను ఖర్చు పెడుతుందని సీఎం వివరించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ల పేరుతో 9 వస్తువులు ఆగస్టు 15 నాటికి ఇస్తామని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాఉ క్రీడల వైపు రాణించాలని సీఎం సూచించారు.
పేద విద్యార్థులకు అభివృద్ధి చెందిన దేశాలలో ఎలాంటి విద్యను అందిస్తున్నారు వంటి వాటిని స్టేడిచేసేందుకు ఇటీవల 50 మంది ఉపాధ్యాయుల ను విదేశాలకు పంపామని, రాబోయే కాలంలో 150 మంది టీచర్లను స్టడీ టూర్ ల పేరు మీద విదేశాలకు పంపుతామని చెప్పారు.






