ప్రేమ వివాహం తర్వాత కొత్త మలుపు
భర్త ఇంటి ముందు యువతి ఆందోళన..
పోలీసుల విచారణ
గద్వాల టౌన్, జూలై 15: ప్రేమించి వివాహం చేసుకున్న అనంతరం భర్త తనను ఇంట్లోకి తీసుకెళ్లలేదని ఆరోపిస్తూ ఓ యువతి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం అనంతపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు, గద్వాల పట్టణంలోని గంటగేరి ప్రాంతానికి చెందిన యువతి గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
గత డిసెంబర్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తగా పెద్దల సమక్షంలో రాజీ కుదిరినట్లు తెలిసింది. అనంతరం వివాహం చేసుకుంటానని యువకుడు హామీ ఇవ్వడంతో ఈ ఏడాది ఏప్రిల్లో యువతి గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఇద్దరూ భీచుపల్లి ఆలయంలో వివాహం చేసుకున్నట్లు తెలిసింది.
అయితే వివాహం అనంతరం తనను కర్నూలులో వదిలి వెళ్లాడని అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లిన తర్వాత తల్లిదండ్రులు ఇంట్లోకి అనుమతించడం లేదని భర్త చెప్పాడని యువతి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం నుంచి అనంతపురం గ్రామంలోని భర్త ఇంటి ముందు యువతి ఆందోళన చేపట్టింది. ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గద్వాల టౌన్ ఎస్త్స్ర కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ ఇరువర్గాల వాదనలు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.






