18న ఛలో యువ సంగ్రామ సదస్సు
పటాన్ చెరు నియోజకవర్గం నుండి 5 వేల మంది హాజరు
మోసాలకు చిరునామా కాంగ్రెస్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, జులై 15: ఎన్నికల ముందు యువజన ప్రకటనలో (నిరుద్యోగ డిక్లరేషన్) నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 18న హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు పటాన్ చెరు నియోజకవర్గం నుండి 5 వేల మంది యువత హాజరుకానున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
బుధవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను ఆయన వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సరూర్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా నేటికి యువజన సంక్షేమంపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ యువతను, రైతులను, మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందని పేర్కొంటూ, ఈ యువజన సమావేశం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతుందని ఆయన అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, నియామకాలలో జాప్యం చేయడం ద్వారా ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువతను నమ్మించి గొంతు కోసిందని విమర్శించారు. ఎస్‌ఐఆర్ అంశంలో పటాన్ చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు అభివృద్ధికి ఓటు హక్కు అత్యంత కీలకమని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






