కడుపు నింపే జిల్లా పాలమూరు
- అమరరాజా ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది
- 3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యం
- సీఎం రేవంత్‌రెడ్డి
- మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభం
- హాజరైన మంత్రులు ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్, జూలై 15 (విజయక్రాంతి): కరువు జిల్లా కాదు కడుపు నింపే జిల్లాగా పాలమూరును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి సమీపంలోని అమరరాజా గిగా కారిడార్ ప్రాజెక్టులో భాగంగా అమరరాజా అడ్వానస్డ్ సెల్ టెక్నాలజీస్ నూతనంగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. అమరరాజా సంస్థ దాదాపు నాలుగు దశాబ్దాల విజయవంతమైన ప్రయాణం అనంతరం తన తొలి భారీ పెట్టుబడిని మహబూబ్‌నగర్ జిల్లాలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. 2047 నాటి కి 3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.
అమరరాజా ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగి చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల కంపెనీలతో పోటీపడుతున్నదని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో భారత్ ప్రపంచస్థాయిలో ఎదగాలంటే అమరరాజా వంటి సాంకేతిక సంస్థలను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో 32 గిగావాట్ గంటల సామర్థ్యంతో అమరరాజా కంపెనీలో ఏర్పాటు చేస్తున్న ఆధునిక ఈవీ బ్యాటరీ తయారీ యూనిట్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో కీలక మైలురాయిగా అభివర్ణించారు.
ఈ పరిశ్రమ ద్వారా 700 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుండగా, వారి లో 400 మంది మహిళలు ఉండటం మహిళా సాధికారతకు నిదర్శనమని పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డికి సంబంధించి 90 టీఎంసీల నీటి కేటాయింపుకై కేంద్ర ప్రభుత్వం తో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అవసరమైన నీటి కేటాయిం పులు, అనుమతులు సాధించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
క్లీన్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తెస్తున్నాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా అమర్ రాజా కంపెనీ 32 గిగావాట్ల ప్లాంటును ప్రారంభించుకోవడం ఒక నిదర్శనమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. విద్యుత్ పరిశ్రమలే కాకుండా, ఎనర్జీ పరిశ్రమలు తీసుకురానున్నమని, క్లీన్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.బ్యాటరీ తయారీలో తెలంగాణ అద్భుతంగా ఉందని ,2023లో 6.8%గా ఉన్న పరిశ్రమల అభివృద్ధి 2026 నాటికి 8.1% చేరుకున్నామని, 2034 నాటికి 13% చేరుకునేలా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.
ఈ ప్రాంతవాసుల అదృష్టం: ఎంపీ అరుణ
అమర రాజా వంటి కంపెనీ మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉండడం ఈ ప్రాంతాలవాసుల అదృష్టమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రస్తుతం మనం విదేశాల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామని, మన డబ్బు విదేశాలకు పోకుండా మనమే అభివృద్ధి చేసుకునేలా ప్రధాన మంత్రి ఆలోచిస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అమర రాజా కంపెనీ సీఎండీ గల్లా జయదేవ్, విక్రమాదిత్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.






