హెల్త్ కార్డుల పంపిణీ ఏమైంది?
- డేట్లు, డెడ్‌లైన్లే తప్ప జారీ ఏదీ?
- మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ స్కీం జూన్ 2 నుంచే అమలు చేస్తామని, మళ్లీ 15 నుంచి అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, మరి హెల్త్ కార్డుల హామీ ఏమైందని మాజీ మంత్రి హరీష్‌రావు నిలదీశారు. ఉద్యోగులకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇంకా ఎన్ని రోజులు కావాలని నిలదీశారు. తేదీలు, డెడ్‌లైన్లు మారుతున్నాయే తప్ప హామీ మాత్రం నిలబెట్టుకోలేని ప్రభుత్వం మీదని మండిపడ్డారు.
బుధవారం ఎక్స్ వేదికగా ఈ అంశంపై హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు, జూలై 15 నుంచే ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పిన మాటలు జూటా అని తేలిపోయిందని విమర్శించారు. ఇప్పటికే పథకం అమలుకోసమని రెండు నెలలుగా ఉద్యోగులు జీతం, పెన్షన్ల నుంచి 1.5శాతం కోత విధించారని, అమలులో మాత్రం చేతులెత్తేశారని నిందించారు.
ఇచ్చిన హామీలు 30 నెలలు గడుస్తున్నా నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యా యుల పాత్రను గుర్తించిన కేసీఆర్.. రెండుసార్లు పీఆర్సీ, 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి గౌరవించారని, ఒక శాతం బేసిక్ పేతో మరింత పటిష్టంగా ఉద్యోగుల హెల్త్ స్కీం రూపొందించేందుకుగాను బీఆర్‌ఎస్ ప్రభు త్వం చర్యలు తీసుకున్నదని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు పెన్షన్ బకాయిల అందక మానసిక వ్యథతో రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణా లు తీసుకునే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఆసుపత్రులకు నిధులు చెెల్లించకుం డా పోలీసుల భద్రత పథకాన్ని కూడా అటకెక్కించారని, జర్నలిస్టుల హెల్త్ కార్డులను గాలికి వదిలేసి జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రశ్నార్థకం చేశారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువున్నాయని విద్యా కమిషన్‌తో చెప్పించారని, మొన్న రిటైర్డ్ ఇంజినీర్లను జైలుకు పంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, లేదంటే వారి పక్షాన బీఆర్‌ఎస్ పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన
బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్‌లో ని తన నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆసు పత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టాలని ప్రశాంత్ రెడ్డి నిర్ణయించుకుంటే, ఆయనను పోలీసులు నిర్బంధించడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రజా స్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమని విమర్శించారు.
తమది‘’ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకుంటూ ప్రతిపక్షాన్ని నిర్బంధించ డం, పోలీసు రాజ్యాన్ని నడపడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. హిట్లర్ స్పూర్తితో ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార అహంకారం తో వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.






