16 July, 2026 | 1:11 AM

యువకుడి దారుణ హత్య!

16-07-2026 12:57 AM
  1. మాజీ ప్రేయసితో దిగిన ఫొటోలు ఆమె భర్తకు పంపడంతో చెలరేగిన వివాదం?
  2. బావమరిదితో కలిసి కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి చంపిన వివాహిత తండ్రి
  3. మాదాపూర్ అరుణోదయ కాలనీలో ఘటన
  4. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు
  5. కుల వివక్షతోనే చంపేశారు: యువకుడి తల్లి

మహబూబాబాద్/శేరిలింగంపల్లి, జూలై 15 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మంగళవారం అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య జరిగింది. గతంలో తా ను ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చే సుకోవడంతో.. సదరు యువకుడు ఆమెతో దిగిన ఫొటోలను ఆమె భర్తకు పంపించడం తో వివాదం తలెత్తినట్టుగా తెలిసింది. దీంతో కక్ష పెంచుకున్న యువతి తండ్రి.. తన బావమరిదితో కలిసి మాదాపూర్‌లోని యువకుడిని కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి చంపే శారని సమాచారం.

సీఐ కృష్ణమోహన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వరంగల్ జి ల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ (30) గత రెం డేళ్లుగా మాదాపూర్‌లోని శ్రీ శ్రీనోమా రెస్టారెంట్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు. ఇదే సమ యంలో అతడికి స్వగ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగింది. అయితే యువతి కుటుంబ సభ్యులు మూడే ళ్ల క్రితం ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.

వివాహం జరిగిన తర్వాత భాస్కర్ ఆ యువతితో గతంలో కలిసి దిగిన ఫోటోలను ఆమె భర్తకు పంపినట్లు విచారణలో తేలింది. ఈ ఫొటోలు అందడంతో యువతి కుటుంబంలో వివాదం నెలకొంది. దీనిపై పలుమార్లు ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు జరిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి తండ్రి తన బావమరిదితో కలిసి భాస్కర్‌ను హత్య చేయాలని పథకం రచించాడు.

భాస్కర్ కదలికలను గమనించి, అవకాశం చూసుకుని మంగళవారం అర్ధరాత్రి మాదాపూర్ అరుణోదయ కాలనీలోని రామేశ్వరం కేఫే ఎదుట కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం యువతి తండ్రి రాజు, అతని బావమరిది పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం.

మాదాపూర్ పోలీసులు యువతిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. 

ఉప్పరపల్లిలో ఉద్రిక్తత 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో నిందితుడు రాజు ఇంటిపై మృతుడి బంధువులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

మృతుడు భాస్కర్ తల్లి సమ్మక్క మాట్లాడుతూ.. ఆ యువతిపై తన కొడుకు మనసు పడలేదని, ఆమె తన కొడుక్కి ఫోన్ చేస్తే మీ అమ్మానాన్న చేసిన పెళ్లి చేసుకోమని చెప్పాడని, ఆమెకు పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు తన కొడుకును అమానుషంగా పొట్టన పెట్టుకున్నారని, కుల వివక్షతతోనే హత్య చేశారని రోదిస్తూ తెలిపింది.