5 May, 2026 | 4:18 AM

టీవీకే విజయం మార్పునకు సంకేతం

05-05-2026 01:32 AM

టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తమిళనాడు టీవీకే అధ్యక్షుడు విజయ్ విజయం దేశ రాజకీయాల్లో ఒక కొత్త మార్పునకు సంకేతమని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. తమిళనాడు అసెం బ్లీ ఎన్నికల ఫలితాలపై సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళ ప్రజలు పంపిన ఈ సంకేతం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదని, దేశమంతటా దీని ప్రభావం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఉన్న రాజకీయ నాయకులతో, పాత పద్ధతులతో ప్రజలు విసిగిపోయారన్నారు.

కేవలం అధికార దాహంతో పని చేసే నాయకులను చూసి విసిగి వేసారిపోయారని, భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగ రాయాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. కొత్త రాజకీయ శక్తులు రావాలని దేశానికి తమిళ ప్రజలు ఒక స్పష్టమైన సందేశం పంపారని, మార్పును ఆకాంక్షించే శక్తులకు ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. పాత రాజకీయ శక్తులపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని ఆమె ఎత్తిచూపారు. కొత్తతరం నాయకత్వం, విభిన్నమైన రాజకీయ ఆలోచనలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమిళనాడు ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఉనికిని, కొత్త పార్టీల అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.