తుంగతుర్తి.. తీరేనా కాంగ్రెస్ ఆర్తి!
- తీవ్రస్థాయికి చేరిన వర్గ విభేదాలు
- ఎమ్మెల్యే సామేలు తీరుపై సీనియర్ నాయకుల ఆగ్రహం
- చక్క దిద్దేందుకు రంగంలోకి దిగిన అధిష్ఠానం
- పంచాయితీ పరిష్కారానికి మధ్యవర్తిగా జగ్గారెడ్డి
- గాంధీభవన్‌లో ఇరు వర్గాలతో సమావేశం
- అయినా వినని నేతలు
సూర్యాపేట, జూలై 11 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఘటనతో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తోంది. అర్వపల్లి వద్ద ఇరువర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు చేసుకోవడం కలకలం రేపింది. మండల అధ్యక్షుల నియామకంలో ఎమ్మెల్యే మందుల సామేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారని సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన పార్టీ నాయకత్వం నియోజకవర్గంలో పరిస్థితిపై చర్చించేందుకు నేతలతో సమావేశం అయింది.
తుంగతుర్తి పంచాయితీని పరిష్కరించేందుకు జిల్లాలో అందరూ నాయకులతో సత్సంబంధాలను కలిగి ఉన్న మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే ఆయన ఇరు వర్గాల నేతలతో గాంధీ భవన్‌లో శనివారం సమావేశమయ్యారు.
డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిలతో పాటు ఇరు వర్గాల నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే గాంధీ భవన్‌లోనూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. దీంతో తుంగతుర్తి నియోజకవర్గం అధిష్టానికి పెద్ద తలనొప్పిగా మారిందని పలువురు చెప్పుకుంటున్నారు. అయితే తుంగతుర్తి.. తీరేనా కాంగ్రెస్ ఆర్తి అంటూ రాజకీయ విశ్లేషకులు పెద్ద చర్చ జరుగుతుండటం గమనార్హం.






