చేపా.. చేపా.. చెరువు చేరవా?
- సంక్షోభంలో తెలంగాణ మత్స్య పరిశ్రమ
- వానాకాలం వచ్చినా చేపపిల్లల పంపిణీ జాడేలేదు!
- టెండర్ల ఫైల్ పక్కనపెట్టిన ప్రభుత్వం!
- 128 కోట్ల బకాయిలు.. కాంట్రాక్టర్ల వెనకడుగు
- 5 లక్షల మత్స్యకార కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకం
* వానాకాలం ప్రారంభమైనా రాష్ట్రంలో మత్స్యకారులకు అందాల్సిన ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలే దు. ఏటా జూన్‌లోనే పూర్తికావాల్సిన టెం డర్ల ప్రక్రియపై జూలై వచ్చినా ప్రభుత్వం లో ఎలాంటి కదలిక లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మత్స్యకార కుటుం బాల జీవనోపాధి ప్రమాదంలో పడినట్టయింది.
ప్రభుత్వ ఉదాసీనత వల్లే మత్స్య రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. రాష్ట్రంలోని 77 భారీ రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులు, 19,465 చిన్న నీటి వనరుల్లో ఉచితంగా చేపపిల్లలను వదిలేందుకు సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లోనే మత్స్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిఉంటుంది.
ఎ చంద్రశేఖర్ రావు :
సంగారెడ్డి, జూలై 11 (విజయక్రాంతి): సాధారణంగా జూన్ నెలలో జిల్లా వారీగా టెండర్లు నిర్వహించి, ఆగస్టు నాటికి చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాలి. ఈ ఏడాది సుమారు రూ.123 కోట్లతో 90 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపి ణీ చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే అధికారులు తొలుత ఎల్ నినో ప్రభావాన్ని సాకుగా చూపి కాలయాపన చేశారు. ప్రభుత్వం నుంచి టెండర్ల ఫైల్‌కు ఇప్పటివరకు ఎలాంటి ఆమోదమూ రాలేదు.
ఈ సందిగ్ధతకు ప్రధాన కారణం గత రెండేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలేనని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్స రాల్లో (2023--24, 2024--25) చేప పిల్లలు సరఫరా చేసిన ప్రైవేట్ కాంట్రాక్టర్లకు (ఫిష్ సీడ్ ఫార్మర్స్) ప్రభుత్వం దాదాపు రూ.128 కోట్ల మేర బిల్లులను పెండింగ్‌లో పెట్టింది.
తమకు రావాల్సిన పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే కొత్త టెండర్లలో పాల్గొంటామని సరఫరాదారులు తెగేసి చెప్తున్నారు. ఈ వ్యవహారంపై సరఫరాదారులు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. బకాయిలను వెం టనే విడుదల చేయాలని హైకోర్టు తీవ్ర ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదల కాలేదు. పాత నిధులు రాక, కొత్త టెండర్లు ఖరారు కాక ఈ ప్రతిష్టాత్మక పథకం పూర్తిగా అటకెక్కిన పరిస్థితి కనిపిస్తోంది.
ఆలస్యమైతే మత్స్యకారులకే నష్టం
చేపల పెంపకంలో సమయపాలన అత్యంత కీలకం. జూలై, ఆగస్టు నెలల్లో చిన్న సైజు చేప పిల్లలను (ఫ్రై/ఫింగర్లింగ్స్) చెరువుల్లో వదిలితేనే, అవి మార్చి, -ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో (కిలో నుంచి రెండు కిలోల బరువు) పెరిగి మార్కెట్ వేటకు అనువుగా మారుతాయి. గత ఏడా ది కూడా ఇదే విధంగా టెండర్లు ఆలస్యం కావడంతో నవంబర్, డిసెంబర్ వరకు పంపిణీ సాగింది.
చలికాలంలో చేప పిల్లలను వదలడం వల్ల శీతల వాతావరణా నికి అవి సరిగ్గా ఎదగక, వ్యాధుల బారిన పడి మత్స్యకారులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని గంగపుత్ర, ముదిరాజ్ మత్స్యకార సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెతుకుసీమలో ఆందోళన
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన జలాశయాలైన మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, సింగూరు ప్రాజెక్టులతో పాటు దాదాపు 4 వేలకు పైగా గొలుసుకట్టు చెరువులు, కుంటలు చేప పిల్లల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. జలవనరులు పుష్క లంగా ఉండటంతో ఈ ఏడాది మత్స్య సంపద భారీగా పెరుగుతుందని ఆశించిన మత్స్యకారులకు నిరాశే ఎదురవుతోంది.
వానాకాలం సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని సుమారు 80 వేల మంది మత్స్యకారుల జీవనోపాధి గాల్లో దీపంగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గతేడాది లెక్కల ప్రకారం దాదాపు 5 కోట్ల 30 లక్షలకు పైగా చేప పిల్లలను, రొయ్య పిల్లలను చెరువుల్లో వదలాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
మెదక్ జిల్లాలోనే దాదాపు 1,718 చెరువులు, కుంటలు ఉండగా, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కలిపి మరో 2,500కు పైగా నీటి వనరులు ఉన్నాయి. వీటన్నింటికీ సంబంధించి ఆయా జిల్లాల అధికారులు ప్రతిపాదనలు (ఇండెంట్) సిద్ధం చేసి హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి పంపి నెలలు గడుస్తున్నా, ఇంతవరకు టెండర్ల నోటిఫికేషన్ వెలువడలేదు.






