బాబ్రీ కూల్చివేతకు పీవీ సహకరించారా?
- సంతోష్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు
- అప్పటి కేంద్రమంత్రి ద్వివేదీ ద్వారా పీవీతో పరిచయం
- రూ.50 వేల ఆర్థిక సాయం చేశారని పాడ్‌కాస్ట్‌లో వెల్లడి
- దూబే వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కలకలం
లక్నో, జూలై 11: బాబ్రీ మసీదు కూల్చివేతకు అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు పరోక్షంగా సహకరించారని, ఆయన సూచనల మేరకు ఈ ఘటన చోటు చేసుకుందని రామజన్మభూమి ఉద్యమ నేత, నాటి కరసేవకుడు సంతోష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరలేపాయి. అప్పటి కేంద్ర మంత్రి బ్రహ్మదత్ ద్వివేది ద్వారా తనకు పీవీతో పరిచయం ఏర్పడిందని, రామజన్మభూమి ఉద్యమానికి మద్దతుగా రూ.50 వేల ఆర్థిక సహాయం కూడా అందిందని పాడ్‌కాస్ట్ ద్వారా దూబే స్పష్టం చేశారు.
అయితే, ఈ ఆరోపణలపై ఎలాంటి అధికారిక పత్రాలు లేదా స్వతంత్ర ఆధారాలను ఆయన వెల్లడించలేదు. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘటనల్లో ఒకటి. అనంతరం దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చోటుచేసుకుని వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు సమాజంలో చీలికలు ఏర్పడ్డాయి.
ఈ ఘటనపై జరిగిన విచారణలు, లిబర్హాన్ కమిషన్ నివేదిక, తదనంతర న్యాయపరమైన ప్రక్రియలు పలు అంశాలను పరిశీలించినప్పటికీ, పీవీ నరసింహారావు కుట్రలో భాగస్వామి అని నిర్ధారించే న్యాయపరమైన నిర్ణయం వెలువడలేదు. అయితే రామజన్మ భూమి ఉద్యమంతో సన్నిహిత సంబంధం ఉండి, కూల్చివేతలో ప్రధాన నిందితుడిగా ఉన్న సంతోష్ దూబే తాజా వ్యాఖ్యలతో నాటి ఉన్నతస్థాయి రాజకీయ నాయకుల పాత్రపై చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా 2014 నాటి కోబ్రాపోస్ట్ నిర్వహించిన ‘ఆపరేషన్ జన్మభూమి’ పరిశోధనల్లో అయోధ్య పరిణామాల పట్ల పీవీ సానుకూల వైఖరి కనబరిచారని పలువురు నేతలు అంగీకరించినట్లు పేర్కొన్నారు. పీవీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న బ్రహ్మదత్ ద్వివేది కేంద్రానికి, కరసేవకుల ఉద్యమ నిర్వాహకులకు వారధిగా వ్యవహరించారని ఆరోపించారు. దూబే ఆరోపణలు కేవలం పరిపాలనాపరమైన వైఫల్యం, నిర్లక్ష్యమే కాకుండా తెరవెనుక వ్యవస్థీకృత రాజకీయ మద్దతు ఉందనే కోణాన్ని సూచిస్తున్నాయి.
న్యాయ, రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే..
దూబే చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నప్పటికీ, వాటిని ఇప్పటివరకు ఏ దర్యాప్తు సంస్థ లేదా అధికారిక రికార్డు ధృవీకరించలేదు. పీవీ నరసింహారావు, బ్రహ్మదత్ ద్వివేది ఇద్దరూ జీవించి లేకపోవడంతో ఈ ఆరోపణలపై వారి స్పందన తెలుసుకునే అవకాశం కూడా లేదు. అందువల్ల, సంతోష్ దూబే చేసిన వ్యాఖ్యలను నిర్ధారిత చారిత్రక వాస్తవాలుగా కాకుం డా, ఆయన వ్యక్తిగత ఆరోపణలుగా మాత్రమే పరిగణించాల్సిన అవసరం ఉందని న్యాయ, రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
నిఘావర్గాల హెచ్చరికలను పట్టించుకోలేదన్న విమర్శలు!
అప్పటి కేంద్ర ప్రభుత్వం బాబ్రీ కూల్చివేతను అడ్డుకోవడంలో విఫలమైందనే విమర్శలు మాత్రం చాలాకాలంగా కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించకపోవడం, భద్రతా చర్యలు సరిపోకపోవడం వంటి అంశాలపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. రాజ్యాంగబద్ధమైన బాధ్యతల కంటే రాజకీయ మనుగడకే ప్రాధాన్యత ఇస్తూ పీవీ ప్రభుత్వం తాత్సార్యం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
మరోవైపు, పి.వి. నరసింహారావు మద్దతుదారులు ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఆయన రాజ్యాంగ పరిమితుల్లోనే వ్యవహరించారని, తెరవెనుక చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశారని వాదిస్తున్నాయి. పీవీ జీవిత చరిత్రలు, అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలు కూడా ఆయన ప్రత్యక్ష ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాలు లేవని పేర్కొంటున్నాయి. అయినప్పటికీ సంతోష్ దూబే వంటి అంతర్గత వ్యక్తుల వాంగ్మూలాలు కొత్త కోణాలను తెరపైకి తీసుకొస్తున్నాయి.
1990 నాటి వాతావరణంలో.. బీజేపీ రథయాత్రకు పెద్దఎత్తున మద్దతు లభిస్తున్న తరుణంలో, అలాగే వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రామమందిర ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సమయంలో.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఏ చిన్న సంకేతమైనా కార్యకర్తలను మరింతగా ధైర్యాన్ని ఇచ్చి ఉండవచ్చని, ఉసిగొల్పి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కూల్చివేత కేవలం ఉద్రేకంతో ఉన్న గుంపు వల్ల అప్పటికప్పుడు జరిగింది కాదని, కొన్ని నివేదికలలో ఆపరేషన్ జన్మభూమిగా పేర్కొన్న ఒక పెద్ద, ముందస్తు ప్రణాళిక, శిక్షణ మరియు వ్యూహాత్మక సమన్వయంలో భాగమేనని దూబే కథనం స్పష్టం చేస్తున్నాయి.






