భవిష్యత్తుకు కోర్ భరోసా!
పుంజుకుంటున్న కోర్ బ్రాంచ్‌లు
సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సులపై క్రేజ్
ఈ గ్రూపుల్లో మొత్తం నిండుతున్న సీట్లు
- ఏఐ రాకతో సాఫ్ట్‌వేర్‌లో భారీగా ఉద్యోగాల కోత
- ఉద్యోగ అవకాశాలతో సాంప్రదాయ బ్రాంచ్‌ల వైపు విద్యార్థులు
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ఇంజనీరింగ్‌లో ఫుల్ డిమాండ్‌గా ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కు ఇప్పుడు క్రమంగా డిమాండ్ తగ్గుతోంది. దానికి బదులుగా సివిల్, మెకానికల్, ఈఈఈ, కెమికల్, ఏరోనాటికల్ వంటి కోర్ సాంప్రదాయ కోర్సులపై విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టి మళ్లింది. ఇటీవల ఎప్‌సెట్ తొలి విడత కౌన్సెలింగ్‌లో ఈ బ్రాంచ్‌ల్లోని పలు గ్రూపుల్లో 100 శాతం సీట్లు నిండటం దీనికి నిదర్శనం.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో సాఫ్ట్‌వేర్ రంగంలో భారీగా ఉద్యో గాల్లో కోత, అనిశ్చితి, సెమీ కండక్టర్ల రంగం వృద్ధి చెందుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మళ్లీ తిరిగి సాంప్రదాయ కోర్సుల వైపే మొగ్గు చూపిస్తున్నారు. సాంప్రదాయ ఇంజినీరింగ్ విభాగాలకు భద్రత ఎక్కువని భావిస్తుండటంతో కోర్ బ్రాంచ్‌లు పుంజుకుంటున్నాయి. కోడింగ్ ఒక్కటే భవిష్యత్తు కాదు అనే అవగాహన విద్యార్థుల్లో వచ్చింది .
ఉద్యోగ ఉపాధి అవకాశాలు, స్థిరత్వం ఉన్న సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల వైపు యువత మళ్లుతోం ది. ఈ నెల 10న ఇంజినీరింగ్ తొలి విడతలో భాగంగా మొత్తం 88,053 సీట్లలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, కెమికల్, ఎరోనాటికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో 79,891 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులోనూ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఏఐ, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గ్రూపుల్లో మాత్రమే వంద శాతం సీట్లు నిండాయి.
మిగతా 14 గ్రూపు ల్లో పూర్తి స్థాయిలో నిండలేదు. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లోని బయోమె డికల్ ఇంజినీ రింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటి క్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (డిజైన్ అండ్ టెక్నాలజీ), ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రూమెంటేషన్ ఇంజినీరింగ్ కోర్సులో ఏకం గా వంద శాతం సీట్లు నిండాయి.
ఇక సివిల్, మెకానికల్ కోర్సుల్లోని గ్రూపుల్లో మెటలార్జికల్ ఇంజినీరింగ్, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టం, బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజినీరింగ్, ఎరోనాటికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ మెటలా ర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీ రింగ్‌లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. వీటితోపాటు కెమికల్ ఇంజినీరింగ్, జియో ఇన్‌ఫ ర్మాటిక్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ వంద శాతం సీట్లు నిండటం గమనార్హం.
భరోసా ఉంటుందని..
ఐటీ రంగంలో లేఆఫ్‌లు, ఫ్రెషర్లకు జీతాలు తగ్గడం, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం విద్యార్థుల్లో పెరిగింది. దీనికి విరుద్ధంగా సివిల్, మెకానికల్, ఈఈఈ విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏఈ, ఏఈఈ, జేఈ ఉద్యోగాలు, రైల్వే, ఇస్రో, డీఆర్డీవో, భెల్, ఎన్టీపీసీ, విద్యుత్ రంగం, సోలా ర్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఫార్మా, పెట్రోకెమికల్ హబ్, ఆటో మొబైల్ రంగం, మ్యానుఫ్యాక్చ రింగ్, ఎయిర్ లైన్స్, డ్రోన్ కంపెనీలు, మైన్స్‌తోపాటు సెమీకండకర్ల రంగాల్లో భారీగా అవకాశాలు ఉన్నాయి.
ఈ కోర్ గ్రూపులను ఎంచుకుంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని స్థిరమైన ఉద్యోగం కావాలనే ఆలోచనే ఈ మార్పుకు ప్రధాన కారణంగా నిపుణులు చెప్తున్నారు. వీటికి తో డూ లార్సెన్ టుబ్రో, టాటా ప్రాజెక్ట్స్, అదా నీ, అంబానీ గ్రూప్, ఆటోమొబైల్, ఏవియేషన్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ల ను పెంచాయి. మెకానికల్, సివిల్, ఈఈఈ విద్యార్థులకు 8--12 లక్షల ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ హెచ్‌ఏఎల్, ఏవియేషన్ కంపెనీల్లో డిమాండ్ పెరిగింది.
ప్రతి కాలేజీలో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఏఐ-డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ పేరుతో వేల సీట్లు పెరిగాయి. సప్లు ఎక్కువై, నాణ్యత తగ్గడంతో కంపెనీలు టాప్ 20 కాలేజీలకే పరిమితమవుతు న్నాయి. దీంతో మిగిలిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కష్టంగా మారుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, సెమీకండక్టర్ మిషన్ లాంటి ప్రాజెక్టుల వల్ల కోర్ ఇంజనీర్లకు రాబోయే 10 ఏళ్లు గోల్డెన్ పీరియడ్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






